iPhone | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా భారత్ సహా ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలతో (Tariffs) దాడికి దిగారు. అమెరికాకు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం టారీఫ్‌లు విధించిన అధ్యక్షుడు ట్రంప్.. గరిష్ఠంగా 49 (అత్యధికంగా కంబోడియా) శాతం వరకు పన్నులు విధించారు. భారత్‌పై 26 శాతం, చైనాపై 34 శాతం, ఐరోపా దేశాలపై 20 శాతం వరకు సుంకాలు విధించారు.
ట్రంప్ టారిఫ్‌ల దెబ్బకు ఐఫోన్లు మరింత ప్రియం కానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ అయిన యాపిల్ ఐఫోన్ ధరలు భారీగా పెరగనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐఫోన్ల ప్రొడక్షన్ ప్రధానంగా చైనా కేంద్రంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఆ దేశ ఉత్పత్తులపై ట్రంప్ భారీగా సుంకాలు విధించారు. ఆ ప్రభావం ఐఫోన్ ధరలపై పడనుంది. ఐఫోన్ మోడల్‌ను బట్టి 30 నుంచి 40 శాతం వరకూ పెరగనున్నట్లు సమాచారం. అయితే, ధరల పెరుగుదల యాపిల్ సంస్థపై ఆధారపడి ఉంటుంది. టారిఫ్ భారాన్ని సంస్థే భరించడమా..? లేక వినియోగదారులపై మోపడమా అనేది యాపిల్ నిర్ణయించాల్సి ఉంది.
ప్రస్తుతం అందరికీ సులభంగా అందుబాటులో ఉండే ఐఫోన్ 16 మోడల్ ధర 799 అమెరికన్ డాలర్లుగా ఉంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.68,000 అన్నమాట. అయితే, పన్నుల భారాన్ని సంస్థ వినియోగదారులపై మోపితే ఇదే మోడల్ ధర 1,142 డాలర్లకు చేరే అవకాశం ఉంది. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.97 వేలకుపైమాటే. ఇక ప్రీమియం మోడల్ ఐఫోన్ 16 ప్రోమ్యాక్స్ (1టెరాబైట్ మోడల్) 2,300 డాలర్లకు.. అంటే రూ.2 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. గతంలో యాపిల్ సంస్థకు కొన్ని ప్రత్యేక మినహాయింపులు లభించి పన్నుల భారాన్ని తగ్గించుకోగలిగింది.
కానీ ఈసారి అటువంటి రాయితీలు లభించకపోవచ్చని సమాచారం. ఇప్పటికే ప్రధాన మార్కెట్లలో ఐఫోన్ విక్రయాలు ఆశించిన స్థాయిలో లేవు. తాజా పరిస్థితుల్లో ధరలు మరింతగా పెరిగితే అమ్మకాలు మరింత పతనం కానున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. ఫలితంగా చైనా వెలుపల తయారయ్యే యాపిల్ ప్రధాన పోటీదారు అయిన శామ్సంగ్ లబ్ధిపొందే అవకాశం ఉంది.
Also Read..
Donald Trump | ట్రంప్ టారీఫ్‌ల మోత.. భారత్‌పై ఎంతంటే?
Tariffs | ట్రంప్ 26 శాతం సుంకాలు.. భారత్ స్పందన ఇదే
Tariffs | టారిఫ్‌ల నుంచి రష్యా, ఉత్తర కొరియా దేశాలకు మినహాయింపు ఇచ్చిన ట్రంప్.. ఎందుకంటే..?