సాధారణంగా ఏదైనా ఒక శరీర భాగంలో కణాలు దెబ్బతింటే.. మళ్లీ అభివృద్ధి చేసుకోగల శక్తి ఆ అవయవాలకు ఉండదు. చర్మం తరువాత ఒక్క కాలేయానికి మాత్రమే ఆ సామర్థ్యం ఉంది. కాలేయంలో దాదాపు 70 శాతం దెబ్బతిన్నా.. తక్కిన భాగంతోనే తన విధులన్నిటినీ నిర్వహించగలుగుతుంది. అంతేకాదు, ఆ విధంగా దెబ్బతినడానికి కారణమైన అలవాట్లు, పరిస్థితులను మార్చుకోగలిగితే.. దెబ్బతిన్న భాగాన్ని కూడా తిరిగి ఆరోగ్యంగా మార్చుకునే శక్తి కాలేయానికి ఉంది. వ్యక్తి మరణించే వరకూ ఈ విధమైన పునరుత్పాదక శక్తి కలిగి ఉండటం కాలేయం గొప్పదనం.
కాలేయం మనిషికి మంచి మిత్రుడు. తనకు నష్టం కలిగిస్తున్న అలవాట్లు, వ్యాధులను గుర్తించి సరిచేసుకోవడానికి ఎంతో అవకాశం ఇస్తుంది. అయితే కాలేయ కణాలు మొత్తం దెబ్బతిన్నప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా చేజారిపోతుంది. కాలేయానికి ఉన్న ప్రత్యేక శక్తి కూడా పనికి రాకుండా పోతుంది. కాలేయం రకరకాల వ్యాధుల వల్ల దెబ్బతింటుంది. వ్యాధులు, మద్యపానం వంటి అలవాట్ల వల్ల దెబ్బతిన్నా.. తొలిదశలో యథావిధిగా పనిచేస్తుంది. కానీ, వ్యాధులను నిర్లక్ష్యం చేసినా, నష్టం కలిగించే అలవాట్లను కొనసాగించినా.. లివర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది.
విపరీతమైన, దీర్ఘకాలపు మద్యపానం (నాలుగైదేండ్ల కన్నా ఎక్కువ), హెపటైటిస్ బి, సి వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల ఎక్కువ మందికి కాలేయ వ్యాధులు వస్తున్నాయి. ఈ కారణాల వల్ల మొదట కామెర్ల వ్యాధి సోకుతుంది. వ్యాధిని గుర్తించి వెంటనే చికిత్స చేయించుకోని పక్షంలో అది కాస్తా ముదిరి కాలేయం పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. వీటిలో హెపటైటిస్ ఎ, ఇ వైరస్ల వల్ల వచ్చే కామెర్లు చాలా ప్రమాదకరం. దీనిలో హఠాత్తుగా కామెర్ల వ్యాధి సోకి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. కలుషితమైన నీళ్లు, తిండి వల్ల ఈ తీవ్రమైన హెపటైటిస్ ఎ, ఇ వైరస్లు శరీరంలోకి చేరుతుంటాయి. చాలాకాలంపాటు మితిమీరి మద్యపానం చేయటం వల్ల కాలేయం తీవ్రంగా దెబ్బతింటుంది. లివర్ సిరోసిస్ వ్యాధి వస్తుంది. ఊబకాయం కూడా కాలేయ వ్యాధులకు కారణం అవుతున్నది.
ఫ్యాట్ సిరోసిస్ లేదా నాన్ ఆల్కహాలిక్ స్టియటోనాష్ ఏర్పడుతుంది. ప్రస్తుతం కాలేయ సమస్యలతో వస్తున్న వారిలో దాదాపు సగం మందిలో ఈ ఫ్యాట్ సిరోసిస్ వ్యాధే కనిపిస్తున్నది. ఫ్యాట్ సిరోసిస్ బి (చివరి), సి చైల్డ్ స్టేజ్‌లో కాలేయ కణాలు చాలా వరకు పనిచేయలేని స్థితికి చేరుకుంటాయి. పిల్లల్లో కనిపిస్తున్న కాలేయ వ్యాధులు చాలా వరకు పుట్టుకతో వస్తున్నవే. శరీర ధర్మక్రియలకు సంబంధించినవే! విల్సన్ డిసీజ్, బైల్ డకట్స్ లేకపోవటం, కణితుల లాంటి సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రకమైన సమస్యలు ఉన్న పిల్లలకు భవిష్యత్తులో కాలేయం పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరుకుంటుంది.
వ్యాధులతో కాలేయం దెబ్బతినటం అత్యంత ప్రమాదకరమైన అనారోగ్య పరిస్థితిని సృష్టిస్తుంది. అయితే అది వ్యాధుల బారినపడకుండా జాగ్రత్త పడేందుకు అవకాశమూ ఉంది. కాలేయంలో తలత్తే సమస్యలను ముందుగానే గుర్తించగలిగితే శస్త్రచికిత్స అవసరం లేకుండా, కేవలం మందులతో వ్యాధిని నయం చేయవచ్చు. కానీ, నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఊహించనంత వేగంగా పరిస్థితి చేజారే ప్రమాదం ఉంది. అయితే, కాలేయం అసాధారణ పని సామర్థ్యం కారణంగా వ్యాధులు సోకినా… లక్షణాలు వెల్లడి కావటానికి పది నుంచి ఇరవై సంవత్సరాల సమయం కూడా పడుతుంది. సుదీర్ఘమైన ఈ సమయంలో కాలేయ కణాలు క్రమంగా మృతి చెందుతూ ఉంటాయి. దీంతో లివర్ స్కార్ (మచ్చలు లేదా సిరోసిస్) ఏర్పడుతుంటుంది. ఈ స్కార్ పూర్తిగా కాలేయాన్ని కప్పేసినప్పుడు రోగ లక్షణాలు స్పష్టంగా బయటపడతాయి. అప్పటికే వ్యాధి ముదిరిపోతుంది.

కాలేయ క్యాన్సర్‌కు దారితీయగల ప్రమాదం ఉన్న (దీర్ఘకాల మద్యపానం, వైరస్ వ్యాధులు సోకినవారు, ఫ్యాటీలివర్ వ్యాధి ఉన్న వారు) ఈ లక్షణాలు పూర్తిగా బయటపడే దాకా వేచి ఉండకుండా ముందస్తుగా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. రక్తపరీక్ష, ఫైబ్రోస్కాన్ (ట్రాన్సియంట్ ఎలాస్టోగ్రఫీ) చేయించుకోవటం ద్వారా కాలేయ క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించవచ్చు. వ్యాధుల వల్ల కాలేయానికి జరిగిన నష్టాన్ని బట్టి దాని తీవ్రతను మూడు స్థాయులుగా గుర్తిస్తారు. వీటిని ఎ, బి, సి ‘చైల్డ్ పగ్ స్టేజెస్’ అంటారు. ‘ఎ’ చైల్డ్ స్థాయిలోనే డాక్టర్ వద్దకు రాగలిగితే మందులతో, అలవాట్లలో మార్పులతో చికిత్స చేసి పూర్తి సాధారణ పరిస్థితిని పునరుద్ధరించవచ్చు.
మొదటి రెండు (ఎ, బి చైల్డ్ స్టేజెస్)స్థాయిల్లోనూ కాలేయం చాలా వరకు తిరిగి కోలుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాలేయం పరిస్థితి పూర్తిగా దిగజారిన దశతో పోలిస్తే ఈ మొదటి దశలో చికిత్సకు అయ్యే ఖర్చు కేవలం పది శాతాన్ని మించదని అంచనా. దురదృష్టవశాత్తు మనదేశంలో కాలేయ వ్యాధిగ్రస్తులలో అత్యధికులు ‘బి’ నుంచి ‘సి’ చైల్డ్ స్టేజీకి మారేక్రమంలో, ‘సి’ చివరి దశలో ఆస్పత్రులకు వస్తున్నారు.
కాలేయ క్యాన్సర్ అంటే ఇదివరకు 90 శాతం మందికి మరణమే అనే భావన ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఇందుకు అవసరమైన అత్యాధునిక శస్త్ర చికిత్స, సర్జరీలతో క్యాన్సర్ కణితులను విజయవంతంగా తొలగించటం సాధ్యమవుతున్నది. క్యాన్సర్ కణితి 3-5 సెం.మీ. వరకూ ఉంటే ఆర్ఎఫ్ఏ, టీఏసీఈ లాంటి సర్జరీయేతర చికిత్స చేస్తారు. వీరిలో 90 శాతం మంది కోలుకుంటారు. అయితే వీరికి రెండు, మూడేండ్లలో మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
అందువల్ల క్రమం తప్పకుండా డాక్టర్‌కు చూపించుకుంటూ ఉండాలి. అవసరమైనపుడు ఆ చికిత్సలను కొనసాగించి క్యాన్సర్ కణితులను అదుపుచేస్తారు. ‘బి’ నుంచి తరువాతి స్థాయికి మారుతున్న స్థితిలో వచ్చిన వారికి, ‘సి’ చైల్డ్ స్థాయి పూర్తిగా ముదరని దశలో వచ్చిన వారికి కాలేయ మార్పిడి చేసి రక్షించవచ్చు. ఇటువంటి కేసులలో కాలేయ మార్పిడి సర్జరీలు 95 శాతం దాకా విజయవంతం అవుతున్నాయి.

ఇటీవలి సంవత్సరాలలో కాలేయ వ్యాధుల చికిత్స అత్యాధునికతను సంతరించుకుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శక్తిమంతమైన మందులు, కచ్చితమైన శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ విజయవంతం అవుతుండటంతో కాలేయ వ్యాధుల నుంచి బయటపడగలం అన్న నమ్మకం కలిగిస్తున్నాయి.
వ్యాధుల వల్ల కాలేయం పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరుకున్నప్పుడు వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు కాలేయ మార్పిడి ఒక్కటే మార్గం అవుతున్నది. ఈ ప్రక్రియలో దెబ్బతిన్న కాలేయాన్ని తీసివేసి, దాని స్థానంలో ఆరోగ్యకరమైన ఇంకో కాలేయాన్ని అమర్చుతారు. దీనిలో దాత నుంచి మొత్తం కాలేయాన్ని గానీ, కొంత భాగాన్ని గానీ సేకరించి అమరుస్తారు. చాలా సందర్భాలలో అవయవదానానికి అంగీకరించిన వ్యక్తి మృతి చెందిన వెంటనే సేకరించిన కాలేయంతోనే కాలేయ మార్పిడి సర్జరీలు చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో సజీవులైన వారు కూడా దాతలుగా ఉంటున్నారు.
రక్తం గ్రూపు కలిసిన కుటుంబ సభ్యులు, సమీప బంధువులు తమ ఆప్తులను రక్షించుకునేందుకు తమ కాలేయంలో నాలుగో వంతు భాగాన్ని దానం చేస్తున్నారు. ఈ విధంగా కాలేయంలో కొంత భాగాన్ని పంచుకున్నప్పటికీ దాతలు తక్కిన కాలేయ భాగంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతున్నారు. కోల్పోయిన భాగాన్ని పునర్నిర్మించుకోగల శక్తి ఉన్నందున కొద్ది వారాలలోనే దాత కాలేయం పూర్వ పరిమాణానికి పెరుగుతుంది. అంటే దాత తాను పంచుకున్న కాలేయ భాగాన్ని తిరిగి అభివృద్ధి చేసుకోగలుగుతారు. అదే సమయంలో స్వీకర్తలో కూడా కాలేయం పూర్తిస్థాయికి ఎదుగుతుంది.

కాలేయానికి ఉన్న ఈ అద్భుతమైన సామర్థ్యం వల్ల ఏ వ్యక్తి అయినా కాలేయాన్ని దానం చేయటానికి వీలు కలుగుతున్నది. అయితే, ఆ వ్యక్తి రక్తం గ్రూప్, ఆరోగ్య పరిస్థతిని పరిశీలించిన తరువాత అది స్వీకర్తకు సరిపోతుందా, లేదా అని నిర్ధారిస్తారు. మద్యపానానికి, మత్తుమందుల (డ్రగ్స్)కు అలవాటు పడినా, సంక్రమణ వ్యాధులు (ఇన్ఫెక్షన్లు) సోకినా, గుండె-ఊపిరితిత్తులు-నాడీ సంబంధిత వ్యాధులు ఉన్నా.. అలాంటి వారు కాలేయం దానానికి పనికిరారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివాళ్లు, యాభై ఏండ్లలపు వయసున్న రక్త సంబంధీకులు ఎవరైనా కాలేయ దానం చేయవచ్చు. కాలేయ దాతలు దీర్ఘకాలంలో ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం రాదు.
బంధువుల్లో దాతలు ఎవరూ ముందుకురాని పక్షంలో లేదా ఆరోగ్యపరంగా అర్హతలు లేనట్లయితే కాలేయ మార్పిడి అవసరమైన వారు ‘జీవన్ దాన్’ పథకం కింద పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే కాలేయ మార్పిడికి రెండు పద్ధతులు ఉన్నాయన్నమాట. మొదటిది, మరణించిన దాత (కెడావరిక్ డోనార్) దేహం నుంచి సేకరించిన దానిని అవసరమైన వారికి అమర్చటం. బ్రెయిన్ డెడ్ (మెదడు మాత్రం మరణించి) వెంటిలేటర్‌పై ఆధారపడిన వ్యక్తి శరీరంలోని ఇతర అవయవాలన్నీ జీవించే ఉంటాయి.
వెంటిలేటర్ తొలగిస్తే ప్రాణం పోతుంది. అటువంటి వ్యక్తి నుంచి కాలేయాన్ని తొలగించి కాలేయ మార్పిడి అవసరమై ఎదురుచూస్తున్న వ్యక్తికి అమరుస్తారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ‘జీవన్ దాన్’ సంస్థలో పేరు నమోదు చేసుకుని తమవంతు వచ్చేంత వరకూ వేచి చూడాల్సి ఉంటుంది. ఇక రెండో పద్ధతి ఆరోగ్యకరమైన కాలేయం ఉన్న వ్యక్తి ఎవరైనా తన కాలేయంలోని కొంత (దాదాపు 25 శాతం) దానం చేయటం.
మార్పిడికి కాలేయం అందుబాటులోకి వచ్చిన వెంటనే వ్యాధిగ్రస్తుడిని ఆపరేషన్‌కు సిద్ధంచేస్తారు. బంధువు (లైవ్ డోనర్) నుంచి కాలేయం తీసుకుంటున్న పక్షంలో వేర్వేరు ఆపరేషన్ థియేటర్లలో ఒకేసారి ఇద్దరికీ సర్జరీ చేస్తారు. బ్రెయిన్ డెడ్ నుంచి కాలేయం సేకరిస్తున్నట్లయితే.. ఆ కాలేయం రాగానే శస్త్రచికిత్స మొదలుపెడతారు. కాలేయ మార్పిడి ఆపరేషన్ పూర్తికావడానికి నాలుగు నుంచి పద్నాలుగు గంటల వరకూ సమయం పడుతుంది. డాక్టర్ల బృందం ఒకటి వ్యాధిగ్రస్తుడి శరీరం నుంచి పనిచేయని కాలేయాన్ని తొలగిస్తుంటే, మరో వైద్యుల బృందం మంచి కాలేయాన్ని మార్పిడికి సిద్ధం చేస్తుంటుంది. ఇవి పూర్తికాగానే ఆరోగ్యవంతమైన కాలేయాన్ని రోగికి అమర్చే సర్జరీ జరుగుతుంది.
ఆరోగ్యవంతమైన కాలేయాన్ని అమర్చి రక్తనాళాలు, బైల్ డకట్స్ కలిపిన వెంటనే లివర్‌లోకి రక్త ప్రవాహం మొదలవుతుంది. ఈ విధంగా అమర్చిన కాలేయాన్ని రిజెక్షన్ (కొత్తగా అమర్చిన అవయవాన్ని శరీరం తిరస్కరించి రోగనిరోధక వ్యవస్థ.. దానిపైన దాడిచేయటం) నుంచి కాపాడి, కాలేయం శరీరంలో సర్దుకుపోయేలా ఇంజెక్షన్లు, ఇతర మందులు ఇస్తారు. రక్తస్రావం, సంక్రమణ వ్యాధుల నుంచి కాపాడతారు. అదే సమయంలో మార్చిన కాలేయాన్ని కాపాడుకుంటూ అది సరిగ్గా పనిచేసేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రోగికి, వారి కుటుంబానికి తెలియజేస్తారు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నుంచి పూర్తిగా కోలుకున్న రోగికి కొన్ని వారాలు విశ్రాంతి అవసరం ఉంటుంది. ఆ తర్వాత వైద్యులు సూచించిన జాగ్రత్తలు తీసుకుంటూ సాధారణ జీవితం గడపొచ్చు.
– డాక్టర్ ధర్మేష్ కపూర్ సీనియర్ హెపటాలజిస్ట్,
లివర్ ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్