హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా అకన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టు పనులను త్వరలో పూర్తి చేస్తామని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. పనుల పురోగతికి అడ్డుగా ఉన్న చట్టపరమైన అవాంతరాలన్నింటినీ అధిగమిస్తామని వివరించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై సోమవారం మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌తో కలిసి సచివాలయంలో మంత్రి ఉత్తమ్ సమీక్షించారు. క్షేత్రస్థాయి సమస్యలను ఇరిగేషన్ అధికారుల ద్వారా అడిగి తెలుసుకొన్నారు.
అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ 1.6 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు పనులు పర్యావరణ అనుమతులతోపాటు న్యాయపరమైన చికులు ఏర్పడటంతో మందగించాయని వివరించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా భూసేకరణ నిధుల మంజూరుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నదని, జూన్ 2కు ముందే ఆ ప్రక్రియను పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని కరీంనగర్, జనగామ, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఆర్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, ఈఎన్సీ జనరల్ రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.