వాగ్దానం… నిర్ణయం… స్పందన… ఈ మూడే నాయకుని రాజకీయ విశ్వసనీయతను తూచే త్రైమాత్ర తూనికలు. అధికారంలో లేనప్పుడు పలికిన మాట,అధికారంలో తీసుకున్న నిర్ణయం, ప్రజా సమస్యలపై వ్యక్తమైన స్పందన ఈ మూడింటి మధ్య ఎంతటి పొంతన ఉంటే అంతే నమ్మకం నిలుస్తుంది. ఇచ్చిన హామీకి,అనంతర వైఖరికి మధ్య అంతరం మొదలైన క్షణమే రాజకీయ పతనం ఆరంభమవుతుంది. ఢిల్లీ రాజపీఠం నీడలో నిరసనకారుల నెత్తిన లాఠీ పడితే దేశ రాజకీయాలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతయి.. మైకులు మోగుతయి. ట్వీట్లు, ప్రకటనలు వెల్లువెత్తుతయి. పార్లమెంట్లో ప్రతిపక్షాల సభ్యులు చర్చ కోరుతరు. రాజ్యాంగంపై దాడిగా రూపాంతరం చెందుతుంది. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశమంతా తిరిగే నాయకత్వం ‘ఇది ప్రజాస్వామ్యం మీద దాడి’ అని గళమెత్తుతున్నది. అదే లాఠీ లంగాణ నేలపై పడితే మాత్రం స్వరం సన్నగిల్లుతున్నది. గళం పట్టుతప్పుతున్నది. భాష మారిపోతున్నది. మౌనం ముందుకు వస్తున్నది. ఎందుకు..?
అసెంబ్లీ ఎన్నికల హోరులో… 2023 మే 30న హైదరాబాద్ అశోక్‌నగర్ లైబ్రరీ మెట్లపై నిలిచిన రాహుల్‌గాంధీ, ముషీరాబాద్ వీధుల్లో నిరుద్యోగ యువత భుజం తట్టిన క్షణం కేవలం ఓ ఎన్నికల ప్రచార కార్యక్రమం కాదు.. తెలంగాణ యువతతో కాంగ్రెస్ కుదుర్చుకున్న రాజకీయ ఒప్పందం. ఏడాదికి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు.. ఏటా క్రమం తప్పని జాబ్ క్యాలెండర్.. ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి.. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. విద్యా భరోసా కార్డులు.. ఈ హామీలన్నింటినీ యూత్ డిక్లరేషన్ పేరుతో ప్రకటించినప్పుడు, వాటిని యువత కేవలం ఎన్నికల వాగ్దానాల జాబితాగా చూడలేదు. తమ భవిష్యత్తుపై రాసిచ్చిన భరోసా పత్రంగా విశ్వసించింది. ‘మీకు అన్యాయం జరిగితే నేనున్నాను… మీ పక్షాన నిలబడుతాను!’ అంటూ నిరుద్యోగుల చేతిలో చెయ్యి వేసి రాహుల్‌గాంధీ మాటిచ్చినందున కాంగ్రెస్ హామీలను నమ్మి ప్రజలు అధికారం కట్టబెట్టారు.
ఢిల్లీలో నీట్ పేపర్ లీక్‌పై నిరసన తెలిపిన సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులపై పోలీస్ చర్య జరగగానే ‘దేశ చరిత్రలోనే మోదీ అత్యంత యువ వ్యతిరేక ప్రధాని’ అని రాహుల్‌గాంధీ నిప్పులు కక్కారు. ‘టియర్ గ్యాస్, లాఠీచార్జి ప్రజాస్వామ్య పద్ధతి కాదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ స్పీకర్‌ను కలిసి పార్లమెంట్లో చర్చ జరిపించాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే లాఠీ తెలంగాణలో నిరుద్యోగుల మీద ఏడు సార్లు విరిగింది.
జనవరి 2026 నుంచి జూన్ 2026 వరకు జరిగిన ఘటనలు తీస్తే దిల్సుఖ్నగర్, అశోక్‌నగర్, సిటీ సెంట్రల్ లైబ్రరీ.. ఇలా ప్రతిచోటా ఒకే దృశ్యం పునరావృతమైంది. నోరు మెదిపితే లాఠీలు ఎత్తుడే.. పోస్టులు పెంచుమని అడిగితే లాఠీచార్జే. లైబ్రరీకి వెళ్తే గేట్లు మూసేసి విద్యార్థులను నిర్బంధించి చేసింది లాఠీచార్జే. జాబ్ క్యాలెండర్ ఏమైందని అడిగిన యువత మీద లేసింది పోలీసుల లాఠీనే. అయినా రాహుల్ గాంధీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా లేదు.
లాఠీచార్జికి బాధ్యునిగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ శిబిరం గొంతు కలిపింది. మరి తెలంగాణలో విద్యా శాఖను తన ఆధీనంలో పెట్టుకొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అదే సూత్రం వర్తిస్తుంది కదా? ఈ విషయం తెలిసి కూడా ఆయనను పదవిలో కొనసాగించటం ద్వంద్వ వైఖరి కాదా?
కాంగ్రేతర ప్రభుత్వం ఉంటే ఒక నీతి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మరో రీతి ఉంటుందా? ఢిల్లీ సరిహద్దుల్లో పుట్టిన నిరసనకు ప్రత్యేక హక్కు లేదు. తెలంగాణ మట్టిలో మొలిచిన అభ్యంతరానిది పరిమిత స్వేచ్ఛా కాదు. నదిని ఏ గట్టు నుంచి చూసినా దాని ప్రవాహమే కనిపిస్తుంది. నిప్పును ఎక్కడ పట్టుకున్నా కాలుతుంది. ఇదే ధర్మం. లాఠీ ఒకటే… గాయమూ ఒకటే… కానీ రెండు వైద్యాలు. నొప్పి ఒకటే కానీ రెండు స్పందనలు. ఇది రాజకీయ వైరుధ్యం కాదు.. యాదృచ్ఛికం కూడా కాదు. ఇది ఎంపిక చేసుకున్న అపరిచిత చిత్త ప్రవృత్తి. ఘటన తీవ్రతను బట్టి కాకుండా, అధికార పీఠం బట్టి రూపాంతరం చెందే విష ఆగ్రహం. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ‘సెలెక్టివ్ అవుట్ రేజ్’ అంటే సౌకర్యవంతమైన ఆగ్రహం అన్నమాట. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఊరూరు తిరిగి గొంతు చించుకుంటున్న రాహుల్, సొంత పార్టీ ఏలుబడిలోని రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే, ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగుల మీద లాఠీలు విరుగుతుంటే మౌనం ఎందుకు? ఢిల్లీ, బిహార్, యూపీలో ఎక్కడ పోలీస్ లాఠీలు లేచినా స్పందిస్తున్నారు. కానీ ‘కష్టం వస్తే.. నేను తోడుంటా’ అని చేతిలో చెయ్యి వేసి హామీ ఇచ్చిన తెలంగాణ నిరుద్యోగి ఒంటి మీద లాఠీ విరిగితే కండ్లు మూసుకుంటారు.
తెలంగాణ యవనిక మీద కొత్త డ్రామా రక్తి కడుతున్నది. విచిత్రంగా కేంద్రంలో బీజేపీని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బీజేపీ ప్రశ్నిస్తున్నది.‘చలో గాంధీ భవన్’ పేరిట బీజేపీ, ‘చలో లోక్ భవన్’ పేరుతో కాంగ్రెస్ చేపట్టిన పరస్పర ముట్టడులు, నాయకుల అరెస్టులు, పోలీసుల నిర్బంధాల రూపంలో రాజధాని నగరంలో రాజకీయ రంగస్థల ప్రదర్శనలు జరుగుతున్నయి.
ప్రజాస్వామ్యంలో నిరసనకు ఒక విలువ ఉన్నది. ఆ ఆందోళన ప్రజల సమస్యలను పరిష్కరించే సాధనంగా కాకుండా, ప్రజల దృష్టిని మళ్లించే రాజకీయ వ్యూహంగా మారినప్పుడు దాని నైతిక బలం క్షీణిస్తుంది. యువత నిరాశ, నిరుద్యోగుల ఆవేదన, నెరవేరని హామీలు ఇవి ఏ పార్టీకీ ప్రచార ఆయుధాలు కావు. పాలకులకు జవాబుదారీతనాన్ని గుర్తుచేసే ప్రజాస్వామ్య ప్రమాణాలు. వాటిని పరస్పర ఆరోపణల పొగమంచులో కనుమరుగు చేయాలని యత్నించటం మూర్కత్వం. ఉద్యోగ కల్పనపై కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులు హామీల నుంచి తప్పించుకోలేవు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం ఎంతో కాలం నిలబడదు. నిరసనను నియంత్రిం చాల్సిన చోట చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు, మానవతా దృక్పథాన్ని విస్మరిం చి, బలప్రయోగానికి పాల్పడటం ప్రజాస్వా మ్య విలువలకే మాయని మచ్చ తెచ్చే పరిణామం.
-వర్ధెల్లి వెంకటేశ్వర్లు