HomeTelanganaEmployees Are Expressing Strong Outrage Over Several Promotions Recently Granted In The Bc Welfare Department
మంత్రి కనుసన్నల్లో ప్రమోషన్ల అక్రమాలు!
బీసీ సంక్షేమ శాఖలో ఇటీవల కల్పించిన పలు ప్రమోషన్లపై ఉద్యోగులు తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. అమాత్యుడి కనుసన్నల్లోనే అక్రమాలు కొనసాగుతున్నాయని సంక్షేమ భవన్లో ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సర్వీస్ నిబంధనలను తుంగలో తొకి, కోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా, కొద్దిమందితోనే సీనియారిటీ జాబితా సిద్ధం చేయడంతోపాటు, వారికే ప్రమోషన్లు కల్పించడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
సర్వీస్ నిబంధనలు, కోర్టు ఆదేశాలు గాలికి!
నచ్చినోళ్లతోనే సీనియారిటీ జాబితా సిద్ధం
బీసీ శాఖలో రచ్చ రచ్చ.. జీఏడీ సైతం కుమ్మకు
సర్కార్, అధికారుల తీరుపై ఉద్యోగుల ఆగ్రహం
ఇప్పటికే అటకెకిన హెచ్‌డబ్ల్యూవో ప్రమోషన్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమ శాఖలో ఇటీవల కల్పించిన పలు ప్రమోషన్లపై ఉద్యోగులు తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. అమాత్యుడి కనుసన్నల్లోనే అక్రమాలు కొనసాగుతున్నాయని సంక్షేమ భవన్లో ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సర్వీస్ నిబంధనలను తుంగలో తొకి, కోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా, కొద్దిమందితోనే సీనియారిటీ జాబితా సిద్ధం చేయడంతోపాటు, వారికే ప్రమోషన్లు కల్పించడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రమోషన్లు కల్పించే ముందే మొత్తం మంజూరైన పోస్టులు, ప్రస్తుత ఖాళీలు, వాటికి గల కారణాలను గుర్తించాలి. ఆ పోస్టులను ఏ కేడర్ సిబ్బందికి ప్రమోషన్లు కల్పించడం ద్వారా భర్తీ చేయాలనేది నిర్ధారించాలి. కేటగిరీ వారీగా ప్రమోషన్ల జాబితాను సిద్ధంచేసి జీఏడీకి పం పాలి. ఆ తర్వాత డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఆ జాబితాను పరిశీలించి నిబంధనలకు లోబడి ప్రమోషన్లను కల్పిస్తుంది. కానీ అవేవీ పాటించకుండానే ప్రమోషన్లు ఇచ్చారని ఉద్యోగులే చెప్తున్నారు.
శాఖలో ఆరు డిప్యూటీ డైరెక్టర్ పోస్టులను జిల్లా బీసీ డెవలప్మెంట్, వెల్ఫేర్ ఆఫీసర్(డీబీసీడీవో)లకు ప్రమోషన్ కల్పించడం ద్వారానే భర్తీ చేయాలి. ప్రస్తుతం 31 డీబీసీడీవో పోస్టులుంటే ఉన్నతాధికారులు కేవలం 8మందితోనే సీనియారిటీ జాబితాను సిద్ధం చేశారు. ఆరేండ్లు సర్వీసు పూర్తిచేసుకున్న పలువురి పేర్లు కూడా ఆ జాబితాలో లేవు. ఇద్దరికి మినహా మిగతా అందరికీ ప్రమోషన్లు కల్పించి ఆ వెంటనే పోస్టింగ్‌లను కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే గతంలో గ్రేడ్-2 హెచ్‌డబ్ల్యూవో(హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్)లు 37మందికి గ్రేడ్-1 హెచ్‌డబ్ల్యూవోలుగా ప్రమోషన్లు కల్పించారు. అందుకోసం 567మందితో సీనియారిటీ జాబితా సిద్ధం చేశారు. కానీ మహిళా రోస్టర్ పాయింట్ల అంశంలోనూ అధికారులు ఇష్టారీతిన వ్యవహరించడంతో వివాదం కోర్టుకు చేరింది. విచారణ పూర్తి కాగా, తీర్పు పెండింగ్‌లో ఉన్నది. కానీ డీడీ ప్రమోషన్లకు కొద్దిమందితోనే సీనియారిటీ జాబితాను సిద్ధం చేయడం గమనార్హం.
జీఏడీ అధికారులు కుమ్మకు!
అక్రమ ప్రమోషన్ల వ్యవహారంలో జీఏడీ అధికారులు సైతం కుమ్మకయ్యారనే ఆరోపణలున్నాయి. వాస్తవంగా ప్రమోషన్ల జాబితా సిద్ధమైన తర్వాత డీపీసీ పరిశీలిస్తుంది. సీనియారిటీ, వేకెన్సీ పొజిషన్, అర్హతలు, విజిలెన్స్ క్లియరెన్స్, డిసిప్లినరీ కేసులు, రోస్టర్ పాయింట్లపై దృష్టి పెట్టి నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అవేవీ పరిశీలించకుండానే డీపీసీ ప్యానల్ ప్రమోషన్లను కల్పించిందని, జీఏడీ అధికారుల అండతోనే ఇది జరిగిందని తెలుస్తున్నది. ప్రమోషన్ పొందిన ఓ ఉద్యోగికి సంబంధించి సామాజికవర్గంపై ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలున్నాయి.
సదరు ఉద్యోగి వాస్తవంగా బీసీ ‘సీ’ కమ్యూనిటీ వారు కాగా, ఎస్సీగా క్లెయిమ్ చేసుకుంటూ ప్రమోషన్లు పొందినట్టు ఆరోపణలున్నాయి. అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించిన తర్వాతే ప్రమోషన్ ఇవ్వాలనే షరతుపైనే గతంలో సదరు అధికారికి ప్రమోషన్ కల్పించారని సమాచారం. మరి వెరిఫికేషన్ జరిగి రిపోర్టు వచ్చిందా? కులం నిర్ధారించారా? లేదా? అనేది తేలకముందే తాజాగా సదరు అధికారికే ప్రమోషన్ కల్పించడమే అనేక అనుమానాలకు తావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టం-2025ను అనుసరించి ఎస్సీ ఉద్యోగులు తమ కుల ధ్రువీకరణ పత్రాలను కొత్తగా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అనేక మంది ఎస్సీ ఉద్యోగులు సర్టిఫికెట్లను సమర్పించినప్పటికీ, ఆరోపణలు ఎదురొంటున్న అధికారి మాత్రం సమర్పించలేదు.
ఈ క్రమంలో జాబితాలో తమ పేర్లు చేర్చకపోవడం పై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం మధ్యంతర ఉత్వర్వులిచ్చింది. కానీ ఆ ఆదేశాలను పట్టించుకోకుండా ప్రమోషన్లు కల్పించడం, జీఏడీ సైతం ప్రశ్నించకపోవడంతో భారీగా అక్రమాలు జరిగాయనేందుకు ఊతమిస్తున్నది. ఆరు డీడీ పోస్టుల్లో ఒక పోస్టును ఎస్టీకి రిజర్వ్ చేయాలి. ప్రస్తుత జాబితాలోనూ ఎస్టీ మహిళ 7వ స్థానంలో ఉన్నా ప్రమోషన్ దకలేదు. ప్రమోషన్ వేకెన్సీని ఎస్టీ రోస్టర్ పాయింట్ ను ఎలా అమలు చేశారనేది ఉన్నతాధికారులు చెప్పకపోవడం, జేఏడీ నిలుపుదల చేయకపోవడం గమనార్హం. క్రమశిక్షణ, తదితర అంశాలపై విచారణ ఎదురొంటున్న వారికి సైతం ప్రమోషన్లను కల్పించారని ఉద్యోగ వర్గాలు నిప్పులు చెరుగుతున్నాయి.
నిలదీస్తే మెమోలు
నిబంధనలను విరుద్ధంగా జరుగుతున్న వ్యవహారాలపై నిలదీస్తే తిరిగి తమపైనే కక్ష సాధిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల సర్వీస్ రూల్స్‌కు సంబంధించి ప్రశ్నించిన ఓ అధికారికి మెమో జారీ చేయడమే గాక, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పింఛన్ రాకుండా అడ్డుకుంటూ తీవ్ర క్షోభకు గురిచేయడం పరిస్థితికి అద్దం పడుతున్నది. ప్రస్తుతం శాఖకు రెగ్యులర్ ప్రిన్సిపల్ సెక్రటరీ లేరు. కమిషనర్‌నే అదనపు బాధ్యతలపై కొనసాగిస్తున్నారు. శాఖకు సంబంధించి అక్రమాలపై ఇతరత్రా సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదులు చేసినా, తిరిగి కమిషనర్ వద్దకే చేరడం, వాటిని పరిశీలించాలని ఆరోపణలు ఎదురొంటున్న అధికారులకే మళ్లీ కమిషనర్ ఎండార్స్ చేయడం, వెరసి చెత్తబుట్టలోకి పోవడం పరిపాటిగా మారిందని చెప్తున్నారు.
శాఖ మంత్రిపై, పలువురు ఉన్నతాధికారుల వ్యవహారంపై బీసీ సంఘాలు సైతం తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నాయి. బీసీ శాఖలో బీసీలకే చోటులేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణం స్పందించాలని, శాఖలో ప్రక్షాళన చేపట్టాలని, లేదంటే పోరుబాట తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
ప్రమోషన్లపై విచారణ జరుపాలి : రాజ్‌కుమార్, బీసీ యువజన సంఘం
బీసీ సంక్షేమ శాఖలో కల్పించిన ప్రమోషన్ల వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి. డీడీ ప్రమోషన్లలో అవకతవకలు జరిగాయి. అక్రమాలపై విచారణలు పూర్తి కాకముందే ప్రమోషన్లు కల్పించడం అనుమానాలకు తావిస్తున్నది. ప్రభుత్వం వాస్తవాలను వెలుగులోకి తెచ్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. తప్పుడు సమాచారం ఇచ్చిన ఉన్నతాధికారులు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఉద్యోగోన్నతులపై పునః సమీక్షించాలి లేదంటే సంక్షేమ భవన్ ఎదుట ధర్నా చేస్తాం.
అమాత్యుడి క్విడ్ ప్రోకో?
ఈ ప్రమోషన్ల వ్యవహారమంతా అమాత్యుడి కనుసన్నల్లోనే జరిగిందని సంక్షేమ భవన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అమాత్యుడి ఒత్తిడితోనే నిబంధనలకు నీళ్లు వదిలారని పలువురు ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. జీఏడీ అధికారులు సైతం కికురుమనకుండా అక్రమ ప్రమోషన్లకు వంత పాడారని వివరిస్తున్నారు. ముఖ్యంగా ఓ అధికారికి, అమాత్యుడికి మధ్య ఉన్న సాన్నిహిత్యంపై జోరుగా చర్చ నడుస్తున్నది. అమాత్యుడికి సదరు అధికారి భారీగా లబ్ధి చేకూర్చారని బాహాటంగానే వినిపిస్తున్నది. అందుకే దొడ్డిదారిలో ప్రమోషన్ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదీగాక ప్రమోషన్లపై ఆ శాఖ మంత్రి కనీసం స్పందించకపోవడం, విచారణకు సైతం ఆదేశించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
ఉద్దేశపూర్వకంగా విస్మరించలేదు : బీసీ సంక్షేమ శాఖ
అవినీతి ఆరోపణలు, శాఖాపరమైన విచారణ విచారణలు పెండింగ్‌లో ఉన్నా పలువురికి ప్రమోషన్లు కల్పించామనేది అవాస్తవమని, తాము ఉద్దేశపూర్వకంగా ఏదీ విస్మరించలేదని బీసీ సంక్షేమ శాఖ స్పష్టంచేసింది. ఒకవేళ విచారణలు పెండింగ్‌లో ఉంటే వాటిని సర్వీస్ రూల్స్ ప్రకారం పరిశీలిస్తామంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘బీసీ సంక్షేమ శాఖ ప్రమోషన్లలో అవకతవకలు’ పేరిట ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన ప్రత్యేక కథనంపై శాఖ స్పందించింది. అవకతవకలు జరుగలేదని ఖండించింది. అయితే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో విచారణలను పరిశీలిస్తామని చెప్పడం గమనార్హం.