హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే ఆరు నెలలపాటు ఎన్నికల కోలాహలం నెలకొననున్నది. వరుస ఎన్నికలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కనున్నాయి. వీటిలో శాసనసభ, శాసనమండలి, పురపాలక, ప్రాదేశిక ఎన్నికలున్నాయి. దీంతో రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి గల్లీలో ఎన్నికల సందడి కనిపించనున్నది. రాజకీయ కోణంలో చెప్పాలంటే.. రాష్ట్ర ప్రజల అభిప్రాయం ప్రతిబింబించే ఎన్నికలుగా వీటిని భావించవచ్చు. అందుకే అధికార, విపక్ష పార్టీలు ఇప్పటికే తమ ప్రణాళికలు, రాజకీయ వ్యూహాలకు పదును పెట్టాయి.
ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై ఇటీవల హైకోర్టు వేటు వేయగా, తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ శాసనసభ స్థానం ఖాళీ అయినట్టే. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో శాసనసభ, సచివాలయం నుంచి ఎన్నికల సంఘానికి సమాచారం వెళ్లనున్నది. ఆ తర్వాత ఉప ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఖమ్మం-వరంగల్-నల్లగొండతోపాటు మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానాల సభ్యుల పదవీ కాలం మార్చితో ముగియనున్నది. ఈ స్థానాలకు ఎన్నికలను రాబోయే ఆరు నెలల్లోపే పూర్తిచేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే మొదలు పెట్టింది. మార్చి నెలాఖరులోపు ఎన్నికల ప్రక్రియ ముగించనున్నారు. అన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రంలోని కీలకమైన జీహెచ్ఎంసీతోపాటు కొత్త కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నది. గత ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ పాలకవర్గ కాలపరిమితి ముగిసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీని మూడు ముక్కలుగా విడగొట్టిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. వీటికి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు సైతం ఎన్నికలు బాకీ ఉన్నాయి. మున్సిపాలిటీల్లో సిద్దిపేట, నకిరేకల్, కొత్తూరు, అచ్చంపేట, మందమర్రి, మణుగూరుకు ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. వీటిని వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లోపు ముగిస్తారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తారా? లేక విడతలవారీగా ఎన్నికలుంటాయా? అనేది వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం పరిషత్ ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని 31 జిల్లా పరిషత్తులకు, 565 మండల పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. వీటిని పూర్తి చేయకపోతే శాసనమండలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. ఉదాహరణకు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించాలంటే కచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయి ఉండాలి. వీటితోపాటు రాష్ట్రంలో గవర్నర్ కోటాలోని రెండు స్థానాలు కూడా ఖాళీ కానున్నా యి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ పదవీ కాలం 2027లో ముగియనున్నది. వీటిని కూడా ప్రభుత్వం నామినేట్ చేయనున్నది. గవర్నర్ కోటాలో ఇద్దరు కొత్త సభ్యులు వచ్చే అవకాశం ఉన్నది.