హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం అందించిన పోస్ట్మెట్రిక్ సాలర్షిప్తో ఏపీలోని డెంటల్ కాలేజీలో బీడీఎస్ పూర్తిచేసిన వరంగల్ విద్యార్థి వీ సాహిత్ ఎండీఎస్ కోర్సులో చేరేందుకు స్థానికత వర్తిస్తుందా అని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది.
ఏపీలోని అమలాపురంలో ఉన్న కోనసీమ డెంటల్ కాలేజీలో బీడీఎస్ పూర్తిచేసిన తనకు తెలంగాణలో ఎండీఎస్లో చేరేందుకు స్థానికత వర్తింపజేయకపోవడాన్ని సవాలు చేస్తూ సాహిత్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానిక కోటా వర్తింపజేయాలంటూ 2024 డిసెంబర్లో ఇదే హైకోర్టు తీర్పు వెలువరించిందని గుర్తుచేశారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి సాలర్షిప్ పొందినంత మాత్రాన స్థానికత వర్తించదదని పేర్కొన్నారు. అనంతరం పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2024లో ప్రభుత్వం జారీచేసిన జీవో 62లోని అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, అందువల్ల ప్రస్తుతం ఈ నిబంధనలను సవాలు చేస్తున్నామని తెలిపారు. దీంతో ఈ అంశంపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాళోజీ మెడికల్ యూనివర్సిటీని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.