వాషింగ్టన్: మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతీకార సుంకాలతో దాడికి దిగారు. భారత్ సహా అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు (Reciprocal Tariffs) విధిస్తున్నట్లు గురువారం తెల్లవారుజామున ప్రకటించారు. అమెరికాకు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం టారీఫ్‌లు విధించిన అధ్యక్షుడు ట్రంప్.. అత్యధికంగా కంబోడియా దిగుమతులపై 49 శాతం, భారత్‌పై 26 శాతం సుంకం విధించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పలు దేశాలపై టారీఫ్‌ల మోత మోగించారు. దీనిని అమెరికాకు విమోచన దినోత్సవంగా (లిబరేషన్ డే) అభివర్ణించిన ట్రంప్.. ఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్, ఆటోమొబైల్ కార్మికులను ట్రంప్ ఆహ్వానించారు. అమెరికాకు మరింత ఎదగడానికి అవకాశం వచ్చిందని, అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందన్నారు. ప్రతీకార సుంకాలను రాయితీ టారీఫ్లుగా అభివర్ణించారు.
ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు తెలిపారు. పలు దేశాలపై జాలితోనే సగం సుంకాలు ప్రకటించినట్లు తెలిపారు. భారత్ నుంచి వచ్చే దిగుమతులపై 26 శాతం సుంకాలు విధిస్తున్నామన్నారు. ఇక చైనాపై 34 శాతం, ఈయూపై 20 శాతం సుంకాలు విధించినట్లు తెలిపారు. ప్రతికార సుంకాలతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని, కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయన్నారు. విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తామని వెల్లడించారు. అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరల్లో వస్తువులు లభిస్తాయన్నారు. దీంతో అమెరికా స్వర్ణయుగమవుతుందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా వాణిజ్య అడ్డంకులను అమెరికా తొలగిస్తూ వచ్చిందని, కానీ పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తూ వచ్చాయన్నారు.
భారత్ చాలా కఠినమైన దేశమని ట్రంప్ అన్నారు. ప్రధాని మోదీ తనకు గొప్ప మిత్రుడని చెప్పారు. కానీ మోదీ మాత్రం అమెరికన్లను సరిగా చూసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాపై భారత్ 52 శాతం పన్నులు వసూలు చేస్తున్నదని, అయినా చాలా ఏండ్లుగా ఆ దేశం నుంచి తాము ఏమీ వసూలు చేయలేదని తెలిపారు. అమెరికాను చాలా ఏండ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారని చెప్పారు. పన్ను చెల్లింపుదారులను 50 ఏండ్లుగా దోచుకున్నారని విమర్శించారు. ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చిందని చెప్పారు. అమెరికా కార్లు విదేశాల్లో తక్కువగా అమ్ముడుపోతున్నాయని చెప్పారు. అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఉక్కు, అల్యూమినియం, ఆటోల దిగుమతులపై కొత్త టారిఫ్‌లు పెంచబోమని స్పష్టం చేశారు.
భారతీయ వస్తువులపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించిన పక్షంలో వ్యవసాయ ఉత్పత్తులు, వజ్రాలు, బంగారం, ఆభరణాలు, రసాయనాలు, ఫార్మా, వైద్య పరికరాలు, విద్యుత్తు పరికరాలు, యంత్రాలతోసహా అనేక రంగాలకు చెందిన వస్తువులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా, భారత్ విధించే దిగుమతి సుంకాల రేట్ల మధ్య చాలా తేడా ఉన్న కారణంగా ట్రంప్ ప్రభుత్వం నుంచి అదనపు కస్టమ్స్ సుంకాలను ఈ రంగాలు ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు తెలిపారు. అమెరికా, భారత్ మధ్య రసాయనాలు, ఫార్మసీ వస్తువుల విషయంలో దిగుమతి సుంకంలో 8.6 శాతం తేడా ఉందని, ప్లాస్టిక్ వస్తువులలో 5.6 శాతం, జౌళి, వస్ర్తాలలో 1.4 శాతం, వజ్రాలు, బంగారం, నగలలో 13.3 శాతం, ఇనుము, ఉక్కు, బేస్ ఇతర ఖనిజాలలో 2.5 శాతం, యంత్రాలు, కంప్యూటర్లలో 5.3 శాతం, ఎలక్ట్రానిక్స్‌లో 7.2 శాతం, ఆటోమొబైల్స్, ఆటోమోటివ్ విడిభాగాలలో 23.1 శాతం వ్యత్యాసం ఉందని వారు తెలిపారు.
ట్రంప్ విధించే ప్రతీకార సుంకాల కారణంగా అమెరికాకు దిగుమతి అయ్యే భారతీయ వస్తువులపై నికరంగా 310 కోట్ల డాలర్ల(రూ. 26,483 కోట్ల) నష్టం ఏర్పడగలదని ఓ నివేదిక అంచనా వేసింది. ఇది భారత జీడీపీపై 0.1 శాతం ప్రభావం చూపగలదని కేర్రిడ్జ్ రేటింగ్స్ డైరెక్టర్ స్మితా రాజ్పూర్కర్ అంచనా వేశారు.
అధ్యక్షుడు ట్రంప్ విధించనున్న ప్రతీకార సుంకాల వల్ల అమెరికాకు భారీ స్థాయిలో ఆదాయం సమకూరే అవకాశం కనిపిస్తోంది. ఏటా రూ. 51 లక్షల కోట్ల ఆదాయం అమెరికాకు సమకూరవచ్చని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.