హోమ్ లోన్ లేదా కారు రుణమో తీసుకొని ఒక్క నెల ఈఎంఐ కట్టకుండా ఆపండి.. బ్యాంకుల నుంచి వందలాదిగా ఫోన్లు వస్తాయి. మూడు వాయిదాలు చెల్లించకపోయారో.. ఇంటికి నోటీసులే కాదు.. జప్తు చేస్తామంటూ బెదిరింపులు కూడా మొదలవుతాయి. సామాన్యుల విషయంలో ఈ రేంజులో విరుచుకుపడే బ్యాంకులు.. కార్పొరేట్ల విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉంటున్నాయి. పేద, మధ్యతరగతి జీవులు పైసాపైసా కూడబెట్టి బ్యాంకుల్లో దాచుకొన్న సొమ్ము.. ఎగవేతదార్ల జేబుల్లోకి పోతున్నది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశీయ బ్యాంకింగ్ రంగంలో రుణాల రైటాఫ్‌లు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగాయి. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు గడిచిన ఐదున్నరేండ్లలో రూ.6.15 లక్షల కోట్లకుపైగా రుణాలను రైటాఫ్ చేశాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం పార్లమెంట్‌కు తెలియజేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు పదకొండేండ్ల పాలనాకాలంలో దేశీయ బ్యాంకింగ్ రంగంలో రుణాల రైటాఫ్‌లు రూ.17 లక్షల కోట్లపైనే ఉండటం గమనార్హం.
న్యూఢిల్లీ, డిసెంబర్ 8: పేద, మధ్యతరగతికి చెందిన సామాన్య రుణగ్రహీతలు తీసుకున్న అరకొర అప్పుల్ని ఎంతో బాధ్యతగా చెల్లిస్తుంటే.. వేల కోట్ల రుణాలు పొందిన కార్పొరేట్ కేటుగాళ్లు మాత్రం వాటిని ఎగవేసి దర్జాగా తిరుగుతున్నారు. ఒక్క నెల రుణ వాయిదాను ఆలస్యంగా చెల్లిస్తేనే సాధారణ కస్టమర్లపై కొరడా ఝుళిపించే బ్యాంకులు.. వేల కోట్ల రుణాలు తీసుకొని ఎగవేతకు పాల్పడిన అసలు సిసలైన మోసగాళ్లను మాత్రం ఊరికే వదిలేస్తున్నాయి. ముఖ్యంగా సర్కారీ బ్యాంకుల్లో రెడ్ కార్పెట్ పరిచి మరీ ఇచ్చిన బడా రుణాలన్నీ మొండి బకాయిలుగానే మారిపోతున్నాయి. చివరకు ఆ అప్పుల కుప్పల్ని రైటాఫ్‌ల పేరిట తొలగించి ఖాతా పుస్తకాలను క్లీన్ చేసుకుంటున్నాయి.
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు గడిచిన ఐదున్నరేండ్లలో రూ.6.15 లక్షల కోట్లకుపైగా రుణాలను రైటాఫ్ చేశాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం పార్లమెంట్‌కు తెలియజేశారు. ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వివరాల ప్రకారం.. 2020-21 నుంచి ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) ప్రథమార్ధం (సెప్టెంబర్ 30) వరకు సర్కారీ బ్యాంకులు రూ.6,15,647 కోట్లను రైటాఫ్ చేశాయి’ అని మంత్రి ఓ ప్రశ్నకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
సగటు వేతన జీవులు రుణాల కోసం బ్యాంకుల మెట్లు ఎన్నిసార్లు ఎక్కాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సిబిల్ స్కోర్ సరిగా లేదని, ఆదాయం తక్కువని, కావాల్సిన లోన్‌కు అర్హత లేదంటూ బ్యాంకర్లు రకరకాల కొర్రీలు పెడుతూ ఉంటారు. అయితే నిబంధనల్ని ఉల్లంఘించిమరీ కార్పొరేట్లకు రుణాలిస్తూపోతారు. కానీ బ్యాంకుల మొండి బకాయి (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏ)ల్లో మెజారిటీ వాటా వ్యాపార, పారిశ్రామికవేత్తలు ఎగ్గొట్టినవే కనిపిస్తాయి. ఇక బడా బాబులకు రుణాల మంజూరులో బ్యాంకుల కుంభకోణాలకు కొదవే లేదు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా.. ఇలా చెప్పుకుంటూపోతే చిట్టా పెద్దదే. రైతులు ఒక్క కిస్తీ కట్టకుంటేనే ఇల్లు పీకి పందిరేసిన దాఖలాలు కోకొల్లలు. కానీ సూటు -బూటేసుకున్న ఈ కార్పొరేట్ కంత్రీలకు పిలిచిమరీ రుణాలు ఇచ్చి.. రైటాఫ్‌లతో బ్యాంకర్లు చేతులు దులిపేసుకుంటున్నారు.
నిజానికి రైటాఫ్లంటే రుణాలను వదులుకున్నట్టు కాదని, వాటి వసూలుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయని అటు బ్యాంకర్లు, ఇటు ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నాయి. ఇందులో డెట్ రికవరీ ట్రిబ్యునళ్లు లేదా సివిల్ కోర్టుల్లో కేసులు వేయడం, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ (సర్ఫేసీ) చట్టం 2002 కింద చర్యలకు దిగడం, దివాలా చట్టం 2016లో భాగంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించడం వంటివి ఉంటాయని తాజాగా మంత్రి చౌదరి సైతం చెప్పారు. అయితే కార్పొరేట్ రుణాల విషయంలో రాజకీయ జోక్యం వల్లే ఎన్పీఏలు పెరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న పెద్దల అండదండలతో బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటున్న కార్పొరేట్లు.. వాటిని ఎగవేస్తే నష్టపోయేది ప్రజాధనాన్నేనని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి చూస్తే.. దేశీయ బ్యాంకింగ్ రంగంలో రుణాల రైటాఫ్‌లు రూ.17 లక్షల కోట్లపైనే ఉండటం గమనార్హం. ఇందులో దాదాపు రూ.14 లక్షల కోట్లదాకా ప్రభుత్వ రంగ బ్యాంకులవేనని అంచనా. ఇక రైటాఫ్ అయిన ఈ మొత్తం లోన్లలో రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలు కార్పొరేట్ కంపెనీలకే చెందినవని తెలుస్తున్నది. ఇదిలావుంటే 2004 నుంచి 2014 వరకు యూపీఏ సర్కారు హయాంలో బ్యాంకుల లోన్ రైటాఫ్‌లు రూ.2.20 లక్షల కోట్లుగా ఉన్నాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కారు హయాంలో ఈ రైటాఫ్‌లు ఎనిమిదింతలకుపైగా ఎగబాకిపోయాయి.

మోదీ పాలనలో రైటాఫ్‌లు 17.2 లక్షల కోట్లు
ప్రభుత్వరంగ బ్యాంకుల రైటాఫ్‌లు 14 లక్షల కోట్లు
కార్పొరేట్ కంపెనీలకు చెందిన మొండి బకాయిలు 10 లక్షల కోట్లు