కోల్కతా: ఒక వ్యక్తికి చెందిన ఆవు రేబిస్ సోకి మరణించింది. అయితే ఆ ఆవు పాలతో తయారు చేసిన పంచామృతాన్ని పలువురు సేవించారు. ఆ ఆవు పాలను కూడా పలువురు వినియోగించారు. (rabies infected cow dies) ఆందోళన చెందిన వారంతా టీకా కోసం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద క్యూకట్టారు. పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పాషాంగ్ గ్రామానికి చెందిన హృషికేశ్ మైతి ఇంట్లో ఆవు ఉన్నది. గత గురువారం పౌర్ణిమ పూజ సందర్భంగా ఆయన ఇంట్లో ఆ ఆవు పాలతో ‘పంచామృతం’ తయారు చేశారు. స్థానికులకు ఆ ప్రసాదాన్ని పంపిణీ చేయగా వారు స్వీకరించారు. ఆ గ్రామానికి చెందిన పలు కుటుంబాలకూ ఆవు పాలను అతడు అమ్మాడు.
కాగా, ఒక రోజు ముందు ఆ ఆవును కుక్క కరిచింది. దీంతో ఆ గురువారం రాత్రి అనారోగ్యంతో అది మరణించింది. రేబిస్ సోకడంతో ఆ ఆవు చనిపోయినట్లు పశువైద్యుడు అనుమానం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఆ ఆవు పాలతో ‘పంచామృతం’ చేసి సేవించిన హృషికేశ్ కుటుంబం ఆందోళన చెందింది. ఆ కుటుంబంలోని 11 మంది ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ రేబిస్ టీకా పొందారు.
మరోవైపు పంచామృతం సేవించిన స్థానికులతోపాటు ఆ ఆవు పాలు వినియోగించిన గ్రామస్తులకు శనివారం ఈ విషయం తెలిసింది. దీంతో వారంతా ఆందోళన చెందారు. పెద్ద సంఖ్యలో స్థానిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. యాంటీ రేబిస్ టీకా కోసం క్యూకట్టారు.
అయితే ఆవు పాల ద్వారా రేబిస్ సోకదని డాక్టర్లు, ఆరోగ్య అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ముందు జాగ్రత్త కోసం తమకు టీకా వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో సుమారు 222 మందికి తొలి డోసు టీకా వేశారు.
గత నెలలో ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ జిల్లాలోని గ్రామంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. రేబిస్తో ఆవు మరణించడంతో సుమారు 200 మంది గ్రామస్తులు యాంటీ రేబిస్ టీకా పొందారు.
Also Read:
Bride asks for bulb on wedding night | తొలిరాత్రి వేళ బల్బు అడిగిన వధువు.. కంగారుపడి మాయమైన వరుడు