ఈ రోజుల్లో చాలామంది బిజీ లైఫ్ స్టైల్ ను లీడ్ చేస్తూ ఆఫీస్లో రోజుకు 8 నుంచి 10 గంటలు కూర్చొనే పనిచేస్తున్నారు. ఇంటికి వెళ్లాక కూడా వాకింగ్ చేయడం పక్కనపెట్టి కూర్చునే ఫోన్లు, టీవీ చూస్తూ గడిపేస్తున్నారు. ఇది వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. ఎప్పుడూ కూర్చునే పనిచేయడం వల్ల రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. రోజుల తరబడి ఇదే ధోరణుంటే ధమనుల్లో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇది గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. రోజుకు ఆరు గంటలకంటే ఎకువసేపు కూర్చోవడం వల్ల జీవక్రియపై ప్రభావం పడి శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు పలకరిస్తాయి.
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నడుము, మెడ, తుంటి కండరాలు బలహీనపడి వెన్ను నొప్పి, మెడ సమస్యలు తలెత్తుతాయి. శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే.. ‘58 నిమిషాల పని, 2 నిమిషాల వ్యాయామం’ ఫార్ములాను ఫాలో అవ్వమని చెబుతున్నారు నిపుణులు. మీరు ప్రతి గంటలో రెండు నిమిషాలపాటు తేలికపాటి కసరత్తులు చేయాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఏ వర్కవుట్లు చేయాలనా మీ సందేహం! ఇదిగో ఇలా ప్రయత్నించండి..
తాయ్ చి హాప్ స్ట్రెచ్ : నిటారుగా నిలబడి కాలి వేళ్లతో పైకి కిందికి కదలండి. ఇలా చేస్తున్నప్పుడు ఒక చేతిని పైకెత్తి, మరొక చేతిని కిందకు దించండి. ఇలా 50సార్లు రిపీట్ చేయండి.
సెమీ-పుష్-అప్స్ : ఏదైనా బేస్ ఉపయోగించి 10 నుంచి 15 పుష్-అప్స్ చేయండి.
సిట్టింగ్ లెగ్ రెసిస్టెన్స్ : కుర్చీలో కూర్చున్నప్పుడు కాలి వేళ్లను పైకి కిందికి కదిలించండి. దీన్ని పదేసి సార్లు చొప్పున మూడు సార్లు రిపీట్ చేయండి వాల్ సిట్: మీ వీపును గోడకు ఆనించి కుర్చీలాగా ముడుచుకుని 1 నిమిషం పాటు కూర్చోండి.
లెగ్ స్వింగ్స్ : నిటారుగా నిలబడి ఒక కాలు ముందుకు వెనుకకు కదిలించండి. ఇలా పదిహేను సార్లు చేయాలి.