ముంబై, డిసెంబర్ 8: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. మదుపరులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపడంతోపాటు ఈవారంలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా తమ పెట్టుబడులను వెనక్కితీసుకోవడం మార్కెట్లో సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఒక దశలో 800 పాయింట్ల పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 85 వేల కీలక మైలురాయిని కోల్పోయింది. చివరకు 609.68 పాయింట్లు కోల్పోయి 85,102.69 వద్ద ముగిసింది. వరుసగా రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన నిఫ్టీ 26 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది.
చివరకు 225.09 పాయింట్లు పతనం చెంది 25,960.55 వద్ద స్థిరపడింది. ఫెడ్ నిర్ణయానికి ముందే మదుపరులు అప్రమత్తతకు మొగ్గుచూపడంతో సూచీలు నష్టపోయాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రెండో త్రైమాసికంలో భారత వృద్ధిరేటు రికార్డు స్థాయిలో నమోదవడం, రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను పావు శాతం తగ్గించినప్పటికీ మదుపరులలో సెంటిమెంట్‌ను మెరుగుపరుచలేకపోయిందన్నారు. మదుపరులు రూ. 7.12 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రూ.464.19 లక్షల కోట్లకు తగ్గింది.
ఇండిగో పేరుతో విమాన సేవలు అందిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేరు కుప్పకూలింది. పైలెట్ల కొరతతో విమాన సర్వీసులను రద్దు ఏడో రోజుకు చేరడంతో కంపెనీ షేరు కకావికలమైంది. సోమవారం కూడా సంస్థ షేరు 8.62 శాతం తగ్గి రూ.4,926.55 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.17,884.76 కోట్లు కరిగిపోవడంతో రూ.2 లక్షల కోట్ల దిగువకు రూ.1,89,719. 34 కోట్లకు పడిపోయింది. నవంబర్ 28న రూ.5,901గా ఉన్న కంపెనీ షేరు ఇప్పటి వరకు 17 శాతం పతనం చెందింది.
రూపాయి విలువ మరింత పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.05 వద్ద ముగిసింది. క్రూడాయిల్ ధరలు భారీగా పుంజుకోవడం, విదేశీ నిధులు తరలిపోవడంతో కరెన్సీ విలువకు మరిన్ని చిల్లులు పడ్డాయని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. అమెరికా-భారత్ మధ్య జరుగుతున్న వాణిజ్యంపై అనిశ్చిత స్థితి నెలకొనడంతో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొన్నదన్నారు. 90.07 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 90.26 కనిష్ఠ స్థాయికి జారుకున్నది. చివరికి 10 పైసలు నష్టపోయి 90.05 వద్ద ముగిసింది.