టీవీల్లో మన అభిమాన నటులు ఏం చెప్పినా ఫాలో అయిపోతాం. వాళ్లు తాగారు కదా అని.. మన శరీరానికి హాని చేసే పలు రకాల ఎనర్జీ డ్రింక్స్‌పైనా ఇష్టం పెంచుకుంటాం. మన హీరో దాని రుచిని చూశాడు కదా అని.. మనమూ వాటిని తెగ తాగేస్తుంటాం. అయితే అలాంటి డ్రింక్‌లను తరచూ తాగితే మన శరీరం 70 శాతం క్షీణిస్తుందని, ప్రధానంగా కిడ్నీ సమస్యలు ఎదురవుతాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలో మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచే రసాయనాలు అధిక మోతాదులో ఉండటమే ఇందుకు కారణం.
ఈ పరిస్థితి రావొద్దంటే.. రసాయనాల డ్రింకులను దూరంపెట్టి మన శరీరానికి శక్తినిచ్చే పానీయాలు ఇంట్లోనే తయారు చేసుకొని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీర జీవక్రియల్లో కీలక పాత్ర పోషించే కిడ్నీని కాపాడుకోవాలంటే రోజూ సమృద్ధిగా నీళ్లు తాగాలి. ప్రతి రోజూ మూడు లీటర్ల నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా నిమ్మ రసం కలిపిన నీళ్లు, గ్రీన్ టీ, అల్లం టీ, చేమంతి టీ మితంగా తీసుకుంటే కిడ్నీల్లోని వ్యర్థాలు తొలగిపోతాయి. దాల్చిన చెక, మెంతులు, జీలకర్ర లాంటి వాటితో చేసిన పానీయాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వాటితోపాటు కొన్ని పండ్లు తినడం వల్ల కిడ్నీలు డీటాక్స్ అవుతాయి. ముఖ్యంగా నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీ రాళ్లను నివారించడంలో సాయపడుతుంది. ఇక మన వంటగదిలో దొరికే అద్భుత ఔషధం వెల్లుల్లి. ఇది పదార్థం రుచిని పెంచడంతోపాటు ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తుంది. వెల్లుల్లిలో యాంటి ఆక్సిడెంట్లు, యాంటి ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు పుషలంగా ఉంటాయి. ఇవి కణాలను ఆక్సీకరణ ఒత్తిడి, వాపు నుంచి రక్షిస్తాయి. శరీరం నుంచి టాక్సిన్లు తొలగించడానికి వెల్లుల్లి సాయపడుతుంది. ఈ తరహా ఆరోగ్య పానీయాలు తీసుకోవడం వల్ల కిడ్నీలను కాపాడుకున్నవాళ్లం అవుతాం.