అగ్ర హీరో రవితేజ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’. అషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలు. కిశోర్ తిరుమల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇప్పటికే తొలి పాట ‘బెల్లా బెల్లా..’ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నదని ఆనందం వ్యక్తం చేస్తున్న మేకర్స్.. ఈ నెల 10న రెండోపాటను విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా ఈ పాట ప్రోమోను సోమవారం విడుదల చేశారు. ‘అద్దం ముందు నిలబడి.. అబద్ధం చెప్పలేనే.. నా అద్దం అంటే నువ్వేమరీ.. ఆ నిజం దాచలేనే..’ అంటూ చంద్రబోస్ రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరపరచగా, శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ కలిసి ఆలపించారు. చక్కటి మెలొడీతో, ఆహ్లాదకరమైన పిక్చరైజేషన్తో ఈ పాట పల్లవి సాగింది. పూర్తి పాటను ఈ నెల 10న విడుదల చేస్తారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, నిర్మాణం: ఎస్ఎల్వీ సినిమాస్.