బుధవారం 03 మార్చి 2021
Business - Dec 22, 2020 , 00:40:29

పసిడి పరుగు

పసిడి పరుగు

  • రూ.500 పెరిగిన తులం ధర
  • రూ.2,250 ఎగబాకిన కిలో వెండి

గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న అతి విలువైన లోహాల ధరలు మళ్లీ ప్రియం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరుగడం, మరోవైపు ఈక్విటీలు భారీగా నష్టపోవడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడంతో ధరలు భగ్గుమన్నాయి.

న్యూఢిల్లీ: ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల పసిడి ధర మరో రూ.500 పెరిగి మళ్లీ రూ.50 వేల మార్క్‌ను దాటింది. చివరకు రూ.50,300 వద్ద ముగిసింది. బంగారంతోపాటు వెండి భారీగా పుంజుకున్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్ళ మద్దతుతో కిలో వెండి ఏకంగా రూ.2,250 ఎగబాకి రూ.69,470 పలికింది. ఈక్విటీలు భారీగా నష్టపోవడం, రూపాయికి మరిన్ని చిల్లులు పడటం ధరలు ఎగబాకడానికి ప్రధాన కారణాలని హెచ్‌డీఎఫ్‌సీ వర్గాలు వెల్లడించాయి. న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,898 డాలర్లు పలుకగా, వెండి 26.63 డాలర్లుగా ఉన్నది. కరోనా వైరస్‌ కారణంగా బ్రిటన్‌ మరోసారి లాక్‌డౌన్‌ ప్రకటించడం, యూరప్‌లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం ఇందుక కారణమన్నారు. అలాగే హైదరాబాద్‌లో 24 క్యారెట్‌ కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.320 అధికమై రూ.51,060 పలికింది. గడిచిన పది రోజుల్లో  పసిడి విలువ ఇంచుమించు వెయ్యి రూపాయలకు పైగా అధికమైంది. 

ఫ్యూచర్‌ మార్కెట్లోనూ..

ఫ్యూచర్‌ మార్కెట్లోనూ బంగారం భగభగమండింది. ఫ్యూచర్‌ మార్కెట్లో తులం బంగారం ధర రూ.411 పెరిగి రూ.50,715 పలికింది. కమోడిటీ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్‌ నెలకొనడం ఇందుకు కారణమని విశ్లేషకులు వెల్లడించారు. 


VIDEOS

logo