Mukesh Ambani : రిలయన్స్ గ్రూప్ (Reliance group) ఛైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తాను తన జీవితంలో చేసిన అతిపెద్ద రిస్క్ (Big risk) గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2016లో రిలయన్స్ జియో (Reliance Jio) తో టెలికాం రంగం (Telecom sector) లోకి తిరిగి అడుగుపెట్టడాన్ని ఆయన తన జీవితంలోనే ‘అతిపెద్ద రిస్క్’ గా ఆయన అభివర్ణించారు.
ఆర్థికంగా విఫలమవుతుందని విశ్లేషకులు అంచనా వేసినప్పటికీ.. భారతదేశాన్ని డిజిటల్‌గా మార్చడంలో జియో పోషించిన పాత్రను తాను మరిచిపోలేనని మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కంపెనీ మెకిన్సీ అండ్ కోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబానీ వెల్లడించారు. ఉచిత వాయిస్ కాల్స్, అతి తక్కువ ధరలో డేటా అందించడం ద్వారా 2016లో భారత టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దాంతో పోటీ సంస్థలు సైతం ధరలు తగ్గించాల్సి వచ్చింది. మొబైల్ ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చింది.
అయితే తాను జియో 4జీ సేవలను ప్రారంభించాలని అనుకున్నప్పుడు చాలామంది అనలిస్టులు అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి భారత్ సిద్ధంగా లేదని చెప్పారని అంబానీ గుర్తుచేశారు. ఆ సందర్భంలో తన బోర్డు సభ్యులతో ఒక్కటే చెప్పానని అన్నారు. ‘మనం ఎక్కువ రాబడి ఆర్జించకపోవచ్చు. అదేమంత పెద్ద సమస్య కాదు. ఇది మన సొంత డబ్బు. ఒక సంస్థగా రిలయన్స్ భారత దేశానికి అందించిన అత్యుత్తమ సేవ అవుతుంది. డిజిటల్ భారతంగా మార్చబోతున్నాం’ అని చెప్పానని అన్నారు.
రిలయన్స్ ప్రస్తుతం 47 కోట్ల మంది యూజర్లతో దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా ఉంది. ‘ఈ భూమ్మీదకు వచ్చేటప్పుడు ఏం లేకుండా వస్తాం. వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్లం. మీరు వదిలిపెట్టేది ఒక సంస్థను మాత్రమే’ అని తన తండ్రి ధీరూభాయ్ అంబానీ ఓ సందర్భంలో తనతో చెప్పిన విషయాన్ని ముకేశ్ అంబానీ గుర్తుచేశారు. 2027లో రిలయన్స్ గోల్డెన్ జూబ్లీ జరుపుకోబోతోందని, వందేళ్లు పూర్తయినా కూడా రిలయన్స్ భారతదేశానికి, మానవాళికి సేవ చేయాలని తాను కోరుకుంటున్నట్లు అంబానీ తెలిపారు.
1960, 70ల్లో రిలయన్స్, 2000, 2020ల్లో రిలయన్స్‌ను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని చెప్పారు. సంస్థ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతోందన్నారు. టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడు మరిన్ని కొత్త అవకాశాలు వస్తాయని, వాటిని విడిచిపెట్టాలనుకోవడం లేదని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రిస్క్ మేనేజ్మెంట్ గురించి ముకేశ్ అంబానీ మాట్లాడారు.
ఏదైనా ప్రారంభించేటప్పుడు అత్యంత ప్రతికూల సందర్భం ఏం ఎదురుకావొచ్చో ముందే ఆలోచించాలని, ఆ స్థితిని ఎదుర్కోవడానికి ముందే సిద్ధం కావాలని, తాను నమ్మే రిస్క్ మేనేజ్మెంట్ సూత్రాల్లో ఇది ఒకటని ముకేశ్ అంబానీ చెప్పారు.