Donald Trump : ఇరాన్ (Iran) ఇక అణ్వాయుధ కార్యక్రమం జోలికి వెళ్లొద్దని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. యురేనియంను శుద్ధి చేయడానికి ఆ దేశం దూరంగా ఉండాలని సూచించారు. ఇరాన్ మద్దతున్న సాయుధ ముఠాల ఆర్థిక మూలాలపై ఇజ్రాయెల్ (Israel) దాడుల తీవ్రత పెంచిన సమయంలో అమెరికా అధ్యక్షుడి నుంచి ఈ హెచ్చరికలు రావడం గమనార్హం.
‘ఇజ్రాయెల్ వాయుసేన దక్షిణ లెబనాన్‌లోని అల్ సాదిక్ కరెన్సీ ఎక్స్ఛేంజి అధిపతి అబ్దుల్లా బక్రిని హతమార్చింది. ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ నుంచి వచ్చే డబ్బును ఈ సంస్థ హెజ్బొల్లాకు మళ్లిస్తున్నది. మరోవైపు యుద్ధం ఆగాలని ఇజ్రాయెల్, ఇరాన్ సమానంగా కోరుకున్నాయి. ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలు, అణు సామర్థ్యాలను ధ్వంసం చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఆ తర్వాతే తాను యుద్ధాన్ని ఆపాను.’ అని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో కాల్పుల విరమణకు సాయం చేస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆఫర్ చేసినట్లు అమెరికా అధినేత ట్రంప్ వెల్లడించారు. అయితే తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు చెప్పారు. ఆయన నెదర్లాండ్‌లో ప్రారంభం కానున్న నాటో సదస్సుకు వెళుతున్న సందర్భంగా ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ లో జర్నలిస్టులకు ఈ విషయాలు వెల్లడించారు.