Cargo ship : మూడు వేల కార్ల లోడుతో మెక్సికో (Mexico) కు వెళ్తూ అగ్నిప్రమాదానికి గురైన ఆ కార్గో నౌక (Cargo ship) ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. కొన్ని వారాల క్రితం ఆ నౌకలో మంటలు చెలరేగాయి. అప్పటి నుంచి క్రమంగా మునుగుతూ ఆ నౌక ఇప్పుడు పూర్తిగా మునిగిపోయింది. నౌకలో మొత్తం 3 వేల కార్లు ఉండగా, వాటిలో 800 ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి.
అలస్కాలోని అలూటియన్ దీవుల వద్ద ఈ నౌక మునిగిపోయిందని లండన్‌కు చెందిన ఓడ నిర్వహణ సంస్థ జోడియాక్ మారిటైమ్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఘటన తర్వాత అంత పెద్దగా కాలుష్యం వెలువడలేదని యూఎస్ కోస్ట్‌గార్డ్ ప్రతినిధి వెల్లడించారు. కాలుష్య నియంత్రణ పరికరాలు కలిగిన రెండు సాల్వేజ్ టగ్‌లను అక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జూన్ 3న రవాణా నౌకలో అగ్నిప్రమాదం జరిగిందని తమకు సమాచారం వచ్చిందని యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి తెలిపారు. ప్రమాద సమయంలో నౌకలో 22 మంది సిబ్బంది ఉండగా వారందరూ లైఫ్బోట్ల ద్వారా బయటపడ్డారని వివరించారు. ఆ సమయంలో సమీపంలోని మర్చంట్ మెరైన్ అనే మరో నౌక వారిని రక్షించిందన్నారు. నౌక వెనుక భాగంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉండటంతో పెద్ద మొత్తంలో పొగలు కనిపించాయని తెలిపారు.