సిద్దిపేట, మార్చి 1: తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్ట్‌లను చిన్నచూపు చూస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ఆదివారం జర్నలిస్ట్‌లకు సిద్దిపేట మినీ స్టేడియంలో నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలు మీడియా టైగర్, రన్నరప్ నైట్ లయన్స్ టీమ్‌లకు బహుమతులు అందజేశారు. కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్ 5 టోర్నీని ప్రారంభించి, మైదానంలో కాసేపు బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతూ హరీశ్‌రావు సరదాగా గడిపారు.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర సాధకుడు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏటా క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టుల కృషి ఎనలేనిదన్నారు. అలాంటి జర్నలిస్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తోందన్నారు. వారికి ఒక అక్రిడిటేషన్ కార్డు ఇవ్వలేదన్నారు.ఉన్న వాటిని ఎలా తొలిగించాలని అనేక నిబంధనలు తెచ్చి ఇబ్బందులు గురిచేస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగులతో పాటు జర్నలిస్టుకు హెల్త్ సీమ్‌లో భాగస్వామ్యం చేశామని, నేడు జర్నలిస్ట్‌లకు హెల్త్ స్కీమ్ నుంచి జర్నలిస్టులను దూరం చేయడం దురదృష్టకరం అన్నారు. కేసీఆర్ హయాంలో జర్నలిస్టులకు కార్పొరేట్ దవాఖానల్లో క్యాష్‌లెస్ చికిత్స ఆందించిన విషయాన్ని గుర్తుచేశారు.
సంక్షేమ నిధికి రూ.100కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్ట్‌లకు ఆర్థిక సహాయం ఆందించామన్నారు. పెన్షన్ సౌకర్యం కల్పించామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జర్నలిస్టు కోసం కేటామించిన రూ.16 కోట్లలో రూపా యి ఖర్చు చేయలేదన్నారు. కేసీఆర్‌ను బద్నాం చేయడం తప్ప కాంగ్రెస్ జర్నలిస్ట్‌ల సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో జర్నలిస్ట్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు రంగాచారి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, నేతలు రాధాకృష్ణశర్మ, కొండం సంపత్‌రెడ్డి, క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి మల్లి కార్జున్, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, రజనీకాంత్‌రెడ్డి, రెబల్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.