WI vs ZIM : లీగ్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి మేటిజట్లను ఓడించిన జింబాబ్వే నాకౌట్లో చతికిలపడింది. వాంఖడే మైదానంలో వెస్టిండీస్ హిట్టర్లను నిలువరించలేక.. ఆపై స్పిన్నర్లను ఎదుర్కోలేక చిత్తుగా ఓడింది. షిమ్రన్ హెట్‌మైర్(85), రొవ్మన్ పావెల్(59) విధ్వంసంతో కరీబియన్ టీమ్ రికార్డు స్కోర్ కొట్టడంతో డీలా పడిన జింబాబ్వే.. భారీ ఛేదనలో పవర్ ప్లేలోనే తడబడింది. ఆరంభంలోనే గుడకేశ్ మోతీ(4-28) తిప్పేసి కోలుకోలేని దెబ్బకొట్టాడు. మేయర్స్(28), సికిందర్ రజా(27) మినహా అందరూ చేతులెత్తేయగా ఆఖర్లో ఎవాన్స్(43) మెరుపులతో పరుగుల అంతరం తగ్గించాడు. 107 పరుగుల భారీ విజయంతో గ్రూప్ ఏలో సెమీస్ రేసులోకి దూసుకెళ్లింది కరీబియన్ జట్టు.
ప్రపంచకప్‌లో సంచలన విజయాలతో నాకౌట్ బెర్తు పట్టేసిన జింబాబ్వేను వెస్టిండీస్ గజగజ వణికించింది. మూడో టైటిల్ వేటలో అదరగొడుతున్న విండీస్.. సోమవారం కొండంత స్కోర్‌తో ఆఫ్రికా జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అనంతరం స్పిన్నర్లు వికెట్ల వేటతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించగా.. ఫీల్డింగ్‌లో మెరికల్లా కదిలిన విండీస్ ఆటగాళ్లు అన్ని క్యాచ్‌లు ఒడిసిపట్టారు. ఫలితంగా.. జింబాబ్వే 147కే పరిమితమవ్వగా.. 107 పరుగుల భారీ తేడాతో షాయ్ హోప్ సేన గెలుపొందింది. దాంతో.. రజా సారథ్యంలోని జింబాబ్వే విజయ ప్రస్థానికి తెరపడింది.
West Indies crush Zimbabwe at the Wankhede! pic.twitter.com/RpYD9bqCaI
— ESPNcricinfo (@ESPNcricinfo) February 23, 2026
తొలి ఓవర్లో ఫోర్, సిక్సర్ బాదిన ఓపెనర్ మరుమని(14) ఆ తర్వాతి ఓవర్లోనే హిట్మైర్ చేతికి చిక్కాడు.. లీగ్ దశలో నాటౌట్‌గా జింబాబ్వే విజయాల్లో కీలకమైన బ్రియాన్ బెన్నెట్(5)ను అకీల్ హొసేన్ బౌల్డ్ చేయగా.. రియాన్ బర్ల్ (౦) పెద్ద షాట్‌కు యత్నించి హిట్మైర్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. 20 పరుగులకే మూడు వికెట్లు పడిన వేళ.. టోనీ మైయర్స్(28), సికిందర్ రజా(27)లు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నించారు. కానీ, ఈ ఇద్దరినీ బౌల్డ్ చేశాడు మోతీ.
Career-best T20I figures for Gudakesh Motie after running through Zimbabwe’s middle-order 🔥 pic.twitter.com/wpwVb82akK
— ESPNcricinfo (@ESPNcricinfo) February 23, 2026
విండీస్ స్పిన్నర్ల ధాటికి.. టోనీ మున్యోంగా(14) కాసేపు నిలబడినా అతడినీ మోతీ డగౌట్ పంపాడు. మిగతా వారు ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరగా.. చివర్లో ఎవాన్స్(43) బౌండరీలతో అలరించాడు. హోల్డర్‌ను ఉతికేస్తూ.. వరుసగా 4, 6, 6 బాదాడు. అర్ధ శతకానికి చేరువైన అతడిని ఫోర్డ్ వెనక్కి పంపడంతో .. విండీస్ 107 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది.
సూపర్ 8 తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు చెలరేగిపోయారు. సంచలన ఆటతో నాకౌట్‌కు దూసుకొచ్చిన జింబాబ్వేను వణికిస్తూ.. షిమ్రన్ హిట్మైర్(85) ఊచకోతకు తెగబడ్డాడు. అరేబియా సముద్రపు సమీపలోని వాంఖడే మైదానంలో తుఫాన్‌లా చెలరేగాడు. రోవ్‌మన్ పావెల్(59) జతగా జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు. వీరిద్దరి దూకుడుతో విండీస్ స్కోర్‌బోర్డు పరుగులు తీసింది. వీరిద్దరూ ఔటయ్యాక.. షెర్ఫానే రూథర్‌ఫోర్డ్(31 నాటౌట్), రొమారియో షెపర్డ్(21)లు తమ స్టయిల్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఫలితంగా ఈ సీజన్లోఅత్యధిక పరుగుల(254) రికార్డు స్కోర్‌తో విండీస్ చరిత్ర లిఖించింది.