Gold Rates | కొండెక్కిన బంగారం ధరలు (Gold Prices) ప్రస్తుతం కొండదిగుతున్నాయి. ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పుత్తడి తిరోగమనబాట పట్టింది. నిన్న ఒక్కరోజే తులంపై రూ.2,340 తగ్గిన ధర.. ఇవాళ కూడా స్వల్పంగా దిగొచ్చింది.
మంగళవారం ఉదయం ట్రేడింగ్లో తులంపై రూ.820 తగ్గింది. దీంతో ఇవాళ ఉదయం హైదరాబాద్ (Hyderabad) బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460కి తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.720 తగ్గి రూ.1,12,250కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,23,420గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,13,140గా ఉంది.
మరోవైపు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఇవాళ ఒక్కరోజే కేజీపై రూ.5వేలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.65 వేలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇవే రేట్లు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడికి డిమాండ్ పడిపోవడంతోపాటు అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన బంగారం నుంచి ఈక్విటీ మార్కెట్లలోకి తగ్గించడంతో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయని నిపుణులు చెబుతున్నారు.
కాగా, పది రోజుల క్రితం తులం బంగారం ఎన్నడూ లేని విధంగా రూ.1.35 లక్షలు దాటిన విషయం తెలిసిందే. దీంతో వినియోగదారులు పుత్తడి కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు బంగారం ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం నెలకొంది. అటు రేట్లు తగ్గడంపై పెట్టుబడిదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Amazon | భారీగా ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైన అమెజాన్.. కంపెనీ చరిత్రలోనే..!
Cyclone Montha: మొంథా అంటే అర్థం ఏమిటో తెలుసా?
తొక్కిసలాట బాధితులను కలిసిన విజయ్