సూరీడు కళ్లు తెరిచి
లోకాన్ని అలా చూస్తాడో లేదో?
సన్నటి వాయిద్యమొకటి
అలలు అలలుగా గాల్లో చేరి
శ్రవణ యంత్రాన్ని మేల్కొలిపేది
బద్దకంగా ఒళ్లు విరుచుకునేలోపే
ఫుల్ల కుసుమిత ద్రుమదళాలు
దేశభక్తి రేఖలతో విప్పారేవి
కేయూర హారావళులను తిరస్కరించి
వాగ్బూషణం సత్యమై మెరిసేది
పాడిపంటలలో రైతు
జీవనభూమిని కాపాడుకుంటుంటే
నిండైన పశుసంపద
ఎదలను అమృతధారలతో తడిపేది
బాలానందాలు పిల్లపక్షులుగా
స్వేచ్ఛగా గగనానికి ఎగిసేవి
భాషాభేషజాలు లేని వివిధ భారతులు
సమన్వయ దృక్పథాలై సాగేవి
మనస్సును దోచే ‘మన్ ఛాహే’ గీతాలు
ప్రశాంత నిద్దురతో కళ్లపై పాకేవి
ఉర్రూతలూగించే ‘యువ’ వాణి సరదాలు
ఉత్సాహపరిచే ఏకాంబరం ముచ్చట్లు
విభిన్న జీవన నవలా స్రవంతులు
రసానుభూతుల కవిత్వాలు
జ్ఞానమార్గాల నీతిబోధలు
హరికథల అట్టహాసాలు
బుర్రకథలు మీటిన తంబూరలు
రూపక లావణ్యంతో మెప్పించి
నాటక సౌందర్యాన్ని రాశిపోసిన
ప్రపంచ వార్తా విస్తరిణి
భూమిపై ప్రసరించిన ఆకాశవాణి!!
ఏదీ? ఆ కనిపించని అవ్యక్త తేజోనిధి?
ఏదీ? ఆ సుమధుర గళ విన్యాస పెన్నిధి?
అహర్నిశలు సమాజాన్ని జాగృతం చేసి
కుటుంబ జీవన విలువలు నేర్పిన
ఇంటింటి వలపు వల్లరి
దృశ్య మాధ్యమ ప్రియురాలికి చిక్కిన
మనుషుల సంబంధాన్ని వదిలి
సాగిపోయింది వినువీధి దారుల వెంట
తిరిగి రాలేక సుదూరంగా!!
– ధూళిపాళ అరుణ