ఏటూరునాగారం, ఫిబ్రవరి 22 : దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసేందుకు మరో డెడ్‌లైన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గతంలో ఈ ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి 2027 మార్చిలోగా పనులన్నీ పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అయితే సీఎం మాత్రం అదే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిచేస్తామని వెల్లడించడంతో అదనంగా మరో తొమ్మిది నెలల గడువు పెరిగింది. ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ఇన్‌టేక్ వెల్‌ను ఇతర మంత్రులతో కలిసి సీఎం సందర్శించారు.
అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమీక్షలో నీటిపారుదల శాఖ చీఫ్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. సమీక్షలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ తమ ప్రాంతాలకు సంబంధించిన భూ సేకరణ, సాగు నీటి అవసరాలు, రిజర్వాయర్లు, పెండింగ్‌లో ఉన్న పనులను వివరించారు. వాటిపై సానుకూలంగా స్పందించిన సీఎం త్వరలోనే అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నిధుల అవసరాలను పరిగణనలోకి తీసుకొని వచ్చే బడ్జెట్ సమావేశాలలోపు పూర్తిస్థాయి అంచనాలను సమర్పించి ఆమోదం తీసుకోవాలని నీటి పారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి సూచించారు.
దేవాదుల ఇన్‌టేక్ వెల్‌లో ఒక మోటారు రిపేరు ఉన్నట్లు తెలుసుకున్న సీఎం దాని వివరాలను నీటి పారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నెల రోజుల్లో రిపేరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీ, దేవాదుల, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టు ఎంత? స్థిరీకరణ ఎంత? భూసేకరణ తదితర వివరాలను అందజేయాలన్నారు. తమ్మిడి హట్టి నుంచి భధ్రాచలం వరకు గోదావరి నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. దేవాదుల ప్రాజెక్టు భూ సేకరణకు అవసరమైన రూ. 600 కోట్లను జూన్ 2లోగా అందజేస్తామన్నారు. అన్ని ప్రాజెక్టుల భూ సేకరణకు ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు.
సమైక్య రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, నిధులు, నీళ్లతో తెలంగాణ ఏర్పాటైందన్నారు. సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ఎంపీలు బలరాంనాయక్, కావ్య, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కేఆర్ నాగరాజు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, ఐటీడీఏ పీవో చిత్రమిశ్రా, ఈఎన్సీ రమేశ్‌బాబు, సీఈ సుధీర్, ఎస్ఈ సీతారాం, రాంప్రసాద్, శివసుబ్రమణ్యం, ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్, ఈఈలు, డీఈఈలు, ఏఈఈలు, మెగా, పవర్ సొలూష్యన్, కాంట్రాక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు మహేందర్‌జీ, వెంకటేశ్, సంపత్‌రావు, డీపీవో వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.