Anil Ambandi : ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ (Anil Ambani)కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరో షాకిచ్చింది. ఇప్పటికే ఆయనను ఆగస్టు 5న విచారణకు రావాల్సిందిగా ఆదేశించిన ఈడీ.. రూ. 3 వేల కోట్ల రుణ మోసం కేసు(Loan Fraud Case)లో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. తద్వారా విచారణ నుంచి తప్పించుకోవడానికి విదేశాలకు వెళ్లడం వంటి ఎత్తుగడలు వేయకుండా అనిల్‌కు ఝలక్ ఇచ్చింది దర్యాప్తు సంస్థ.
దేశంలోని అన్ని విమానాశ్రయాలతో పాటు నౌకాశ్రయాలకు ఈ నోటీసును పంపించిన ఈడీ.. చోటా అంబానీకి ఉచ్చుబిగించింది. మామూలుగా ఎగవేతదారులు కేసుల నుంచి ఉపశమనం కోసం దేశం విడిచి పారిపోతుంటారు. లుకౌట్ నోటీసు జారీ చేయడం ద్వారా వారిని దేశం దాటకుండా అడ్డుకోవచ్చు. అంతేకాదు.. కనిపించిన వెంటనే అరెస్టు చేసే అధికారమూ ఈడీకి ఉంటుంది.
#AnilAmbani pic.twitter.com/z5gTDrKE4L
— NDTV (@ndtv) August 1, 2025
ధీరుభాయ్ అంబానీ రెండో కుమారుడైన అనిల్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. వ్యాపారంలో నష్టాలకు తోడు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించకపోవడం ఆయన కష్టాలను మరింత పెంచాయి. ఆయనపై నమోదైన రూ.3 వేల కోట్ల విలువైన రుణ మోసానికి సంబంధించిన కేసు (Loan Fraud Case)ను ఈడీ దర్యాప్తు చేస్తోంది. 2017 నుంచి 2019 మధ్యలో అంబానీకి ఎస్ బ్యాంక్ ఈ మొత్తాన్ని అప్పుగా ఇచ్చింది. అయితే.. లోన్ జారీకి ముందే బ్యాంకు అధికారులకు ముడుపులు ముట్టాయని ఈడీ దర్యాప్తులో తేలింది. ఇద్దరికీ లాభదాయకంగా జరిగిన ఈ రుణ మోసంలో విచారణ ఎదుర్కొంటున్న అంబానీపై లుక్ ఔట్ నోటీస్ ఇచ్చింది ఈడీ.