IND vs ENG : ఓవల్ టెస్టులో భారత పేసర్ల ధాటికి ఇంగ్లండ్ ఆలౌట్ అంచున నిలిచింది. ప్రసిధ్ కృష్ణ(4-60), మహ్మద్ సిరాజ్(3-83)లు పోటాపోటీగా వికెట్లు తీయగా ఆతిథ్య జట్టు 8 వికెట్లు కోల్పోయింది. క్రిస్ వోక్స్ గాయంతో బ్యాటింగ్‌కు రాలేని పరిస్థితి. దాంతో.. ఇంకొక్క వికెట్ తీస్తే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగుస్తుందనగా వరుణుడు భారత బౌలర్ల జోరుకు అడ్డుపడ్డాడు. ప్రస్తుతానికి ఓలీ పోప్ బృందం 18 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఒంటరి పోరాటం చేస్తున్న హ్యారీ బ్రూక్ (48 నాటౌట్) హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. చివరి బ్యాటర్ జోష్ టంగ్ సాయంతో లీడ్‌ను మరింత పెంచాలనుకుంటున్నాడు బ్రూక్.
ఓపెనర్ల విధ్వంసంతో భారీ స్కోర్ కొడుతుందనుకున్న ఇంగ్లండ్ ఆలౌట్ ప్రమాదంలో పడింది. లంచ్ తర్వాత భారత పేస్ ద్వయం ప్రసిధ్ కృష్ణ, సిరాజ్ జోరుతో ఆతిథ్య జట్టు బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. ఓలీ పోప్(22) జో రూట్(29)లను ఎల్బీగా ఔట్ చేసి ఆతిథ్య జట్టును దెబ్బకొట్టిన మియా భాయ్.. కాసేపటికే కొత్త కుర్రాడు జాకబ్ బెథెల్(6)ను యార్కర్‌తో వెనక్కి పంపాడు.
Prasidh Krishna gets his fourth with the dismissal of Atkinson – England are onto their final stand with Woakes unable to bathttps://t.co/rrZF1qeH0S #ENGvIND pic.twitter.com/yGMAM8J5ds
— ESPNcricinfo (@ESPNcricinfo) August 1, 2025
వరుసగా ఏడో ఓవర్ వేసిన అతడు ఆడడానికి ఏమాత్రం వీలులేని బంతితో బెథెల్ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. అంతే.. ఇంగ్లండ్ 195కే ఐదో వికెట్ కోల్పోయింది. అప్పటికీ భారత స్కోర్‌కు 28 రన్స్ వెనుకంజలో ఉంది పోప్ సేన. కష్టాల్లో పడిన జట్టును హ్యారీ బ్రూక్(22 నాటౌట్), ఆపద్భాందవుడు జేమీ స్మిత్(5 నాటౌట్)లు గట్టెక్కించే బాధ్యత తీసుకున్నారు. కానీ, టీకి ముందు ఒకే ఓవర్లో ప్రసిధ్ కృష్ణ.. స్మిత్, జేమీ ఓవర్టన్‌లను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు.