హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 23 : కాకతీయ యూనివర్సిటీలో ఎంబీఏ, ఎకనామిక్స్ ఫస్ట్ఇయర్ విద్యార్థులు మధ్యాహ్న భోజనంలో చికెన్ కోసం కొట్టుకోవడంతో కేయూ రణరంగంగా మారింది. వివరాల్లోకి వెళితే.. వర్సిటీలోని జ్యోతిరావుఫూలే న్యూపీజీ హాస్టల్లో ఎంబీఏ, ఎకనామిక్స్, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ విభాగాల విద్యార్థులు ఉంటున్నారు. భోజనాలు వడ్డించేందుకు ప్రతినెలా ఒక్కో కమిటీని విద్యార్థులు ఎన్నుకుంటారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఎకనామిక్స్‌కు చెందిన విద్యార్థులు చికెన్ వడ్డించే క్రమంలో వివాదం నెలకొన్నది. తమకు చికెన్ వేయకుండా ఎకనామిక్స్ విద్యార్థులు దాచిపెట్టుకున్నారని ఎంబీఏ విద్యార్థులు ఆరోపించారు. దీంతో వారిమధ్య ఘర్షణ నెలకొంది.
ఈ ఘటనలో ఓ విద్యార్థి తలపగిలి తీవ్ర రక్తస్రావం కాగా, మరో విద్యార్థి చేయి విరిగింది. ఓ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శితోపాటు ఇతర నాయకులు హాస్టల్‌కు వచ్చి దాడికి పాల్పడినట్లు బాధిత విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేయూ పోలీసులు చేరుకుని క్షతగాత్రులను ఎంజీఎం దవాఖానకు తరలించారు. బయటి వ్యక్తులు యూనివర్సిటీ మెస్‌లోకి వచ్చి తినడం వల్ల ఘర్షణలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతోపాటు జాయింట్ డైరెక్టర్లు పట్టించుకోకపోవడంతో కేయూలో గొడవలు నిత్యకృత్యమవుతున్నాయని వాపోతున్నారు. ఈ ఘటనలో వర్సిటీ అధికారులు సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. గొడవకు పాల్పడిన విద్యార్థులకు నోటీసులు జారీచేసి సస్పెండ్ చేయనున్నట్టు సమాచారం.