పాలకుర్తి, ఫిబ్రవరి 23 : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థినులు పాలకుర్తి-స్టేషన్‌ఘన్‌పూర్ ప్రధాన రహదారిపై సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. కడుపునిండా భోజనం పెట్టడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. సమయపాలన పాటించకుండా భోజనం పెడుతున్నారని, హాస్టల్ వార్డెన్ మల్లీశ్వరి గదుల్లో నిర్భంధించి వేధింపులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు హాస్టల్లోకి ప్రవేశించి క్షుద్ర పూజలు చేస్తుండడంతో భయభ్రాంతులకు గురవుతున్నామని తెలిపారు.
ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని పేర్కొన్నారు. సీఐ జానకిరామిరెడ్డి, ఎస్సై పవన్‌కుమార్ వచ్చి ఆందోళనను విరమించాలని కోరినా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం హాస్టల్లోని వంట గదులను పరిశీలించారు.