హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే వారిని సైతం అనుమతిస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య తెలిపారు. పరీక్షలకు 1,495 సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 9.97లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారని తెలిపారు. హాల్‌టికెట్లపై క్యూఆర్‌కోడ్‌ను ముద్రించామని పేర్కొన్నారు. పలు కారణాలతో పరీక్ష ఫీజు చెల్లించని, హాల్‌టికెట్లు రాని 300 మంది విద్యార్థులను పరీక్షలకు అనుమతించింది.
ప్రాథమిక పాఠశాల టీచర్లను ఇంటర్ వార్షిక పరీక్షల విధుల నుంచి మినహాయించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్ సోమవారం ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్యను కలిసి వినతిపత్రం సమర్పించారు. అన్ని డ్యూటీల నుంచి మినహాయించాలని కోరారు.
చేగుంట,ఫిబ్రవరి23: హాల్ టికెట్ కోసం వెళ్లి ఓ విద్యార్థి మృతిచెందిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకున్నది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చేగుంటకు చెందిన మిట్టపల్లి అనిత-రాజు కుమారుడు యశ్వంత్ (17) మియాపూర్‌లోని సీఎంఎస్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం హాల్‌టికెట్ కోసం కళాశాలకు వెళ్లి పడిపోవడంతో సిబ్బంది సమీపంలోని దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు యశ్వంత్ అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.