హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : కాలేజీల యాజమాన్యం చేసిన పొరపాట్లకు విద్యార్థులను శిక్షించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యార్థులు చెల్లించిన ఫీజులను కాలేజీలు సకాలంలో ఇంటర్మీడియట్ బోర్డుకు జమ చేయలేదన్న కారణంతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. తాము చెల్లించిన ఫీజులను కాలేజీలు ఇంటర్ బోర్డుకు చెల్లించకపోవడంతో హాల్టికెట్లు అందలేదని, దీంతో తమను పరీక్షలకు అనుమతించడం లేదని పేర్కొంటూ 8 మంది విద్యార్థులు హైకోర్టులో టిషన్లు దాఖలు చేశారు.
జస్టిస్ ఈవీ వేణుగోపాల్ విచారణ జరిపారు. ఈ వ్యవహారంలో పిటిషనర్ల తప్పేమీ కనిపించడంలేదని, కాలేజీల తప్పు వల్ల వారి హకులను హరించడం సరికాదని పేర్కొన్నారు. తగిన సమయంలో ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డుకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేశారు.