Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘పెద్ది’కి ఓటీటీ ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సీనియర్ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమాపై తన విశ్లేషణను పంచుకున్నారు. ‘పరుచూరి పాఠాలు’ యూట్యూబ్ వేదికగా ఆయన మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన పలు అంశాలను ప్రశంసించడంతో పాటు కొన్ని లోపాలను కూడా ప్రస్తావించారు.
ఒక మారుమూల పల్లెటూరిలో రైలు ఆగాలనే లక్ష్యంతో దాదాపు మూడు గంటల నిడివి ఉన్న కథను ఆసక్తికరంగా నడిపించడం దర్శకుడికి పెద్ద సాహసమని పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ప్రేక్షకులను ఆకట్టుకుందని ప్రశంసించారు. ‘పెద్ది’ విజయానికి రామ్ చరణ్ నటన ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. రామ్ చరణ్ కాకుండా మరొక హీరో నటించి ఉంటే ఈ స్థాయి విజయం దక్కేదా అన్నది అనుమానమేనని వ్యాఖ్యానించారు. సినిమా మొత్తాన్ని చరణ్ తన అద్భుతమైన నటనతో భుజాలపై మోశారని, భారీ కలెక్షన్లు రావడానికి ఆయన పెర్ఫార్మెన్స్ కూడా ప్రధాన కారణమని అన్నారు.
సినిమాలో జగపతిబాబు పోషించిన పాత్ర కూడా ఎంతో బలంగా ఉందని పరుచూరి కొనియాడారు. కథలో ఆయన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని, నటుడిగా జగపతిబాబు మరోసారి తన సత్తా చాటారని పేర్కొన్నారు. అదేవిధంగా ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని అన్నారు. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా కథకు బలాన్ని చేకూర్చిందని ప్రశంసించారు. ప్రజాస్వామ్యంలో ఓట్లు కూడా లేని ఓ మారుమూల గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే కథానాయకుడి లక్ష్యం సినిమాకు ప్రత్యేకమైన బలమని పరుచూరి తెలిపారు. ఆ గ్రామంలో రైలు ఆగేలా చేయాలనే ఆశయంతో హీరో ముందుకు సాగుతాడని, క్రికెట్, కుస్తీల్లో విఫలమైనప్పటికీ చివరకు పరుగు పందెంలో విజయం సాధించి తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే విధానం ఆకట్టుకునేలా ఉందని అన్నారు.
అయితే సినిమా విషయంలో కొన్ని లోపాలను కూడా పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ కాస్ట్యూమ్స్, వేషధారణ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి కొంత దూరంగా అనిపించాయని అభిప్రాయపడ్డారు. కొండ ప్రాంతాల నేపథ్యాన్ని ప్రతిబింబించేందుకే మేకర్స్ ఆ తరహా కాస్ట్యూమ్స్‌ను ఎంచుకుని ఉండొచ్చని పేర్కొన్నారు. అలాగే జాన్వీ కపూర్ పోషించిన హీరోయిన్ పాత్రకు సినిమాలో ఎక్కువ పరిధి లేదని అన్నారు. కథలో ఆమె పాత్రకు మరింత ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అన్నింటికంటే ముఖ్యంగా ‘పెద్ది’ రన్‌టైమ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉండాల్సిందని పరుచూరి సూచించారు. సినిమాలో అవసరమైన చోట్ల సుమారు 30 నుంచి 40 నిమిషాల వరకు నిడివిని తగ్గించి ఉంటే సినిమా మరింత ప్రభావవంతంగా ఉండేదని అన్నారు.అదే సమయంలో హీరోయిన్ పాత్రను కూడా విస్తరించి ఉంటే థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ ‘పెద్ది’ మరింత భారీ విజయాన్ని అందుకునే అవకాశం ఉండేదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.