కారేపల్లి, ఆగస్టు 01 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గోవింద్తండాలో భూమి వివాదమై పత్తి పంటను ధ్వంసం చేసిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. గోవింద్తండాకు చెందిన బర్మావత్ భద్రు, బర్మావత్ రాందాస్ వరసకు సోదరులు. 1998 సంవత్సరంలో బర్మావత్ భద్రు తనకు ఉన్న రెండు ఎకరాల్లో కుటుంబ అవసరాలకు ఒక ఎకరాన్ని బర్మావత్ రాందాస్‌కు అమ్మాడు. దానికి సంబంధించి సాదాబైనామా సందర్భంగా పట్టా చేయించుకోవాటానికి లింక్ డ్యాకుమెంట్ కావాలని భద్రును రాందాస్ కోరాడు. దీంతో భద్రు తాను గతంలో కొనుగోలు చేసిన 2 ఎకరాల లింక్ డాక్యుమెంట్ ఇచ్చాడు. ఇదే అదనుగా చేసుకున్న రాందాస్ ఆ లింక్ డాక్యుమెంట్‌తో తాను కొనుగోలు చేసిన ఎకరంతో పాటు భద్రుకు చెందిన ఎకరం భూమిని కూడా తన పేరుపై పట్టా చేయించుకున్నాడు. రైతు బంధు సైతం పొందుతున్నాడు.
గ్రామంలో ఎవరితోనూ సఖ్యతగా ఉండని భద్రు ఆ ఊరి నుండి వెళ్లి పక్క గ్రామం చీమలవారిగూడెంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో బర్మావత్ భద్రు సాగుచేస్తున్న భూమిపై హక్కు తనకే ఉందని ఎవరూ లేని సమయంలో రాందాస్ గురువారం రాత్రి పత్తి పంటను ట్రాక్టర్‌తో ధ్వంసం చేసి పరారయ్యాడు. భద్రు ఫిర్యాదు మేరకు సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి, ఎస్ఐ బైరు గోపి ధ్వంసమైన పంటను పరిశీలించారు. నిందితుడైన రాందాస్ తనపై గ్రామస్తులు దాడి చేస్తారనే భయంతో పోలీసు స్టేషన్ లో తలదాచుకున్నాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు పోలీసు స్టేషన్ చేరుకుని రాందాస్‌ను బయటకు రప్పించి దాడికి ప్రయత్నంచగా పోలీసులు అడ్డుకుని గ్రామస్తులను హెచ్చరించి పంపించి వేశారు. దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు.
Karepalli : భూ వివాదమై పత్తి పంట ధ్వంసం