Anil Ambani | ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani) ఈడీ విచారణకు హాజరయ్యారు. రూ.17 వేల కోట్ల విలువైన రుణ మోసానికి సంబంధించిన కేసులో (Loan Fraud Case) 5న విచారణకు రావాలంటూ ఈ నెల 1న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చోటా అంబానీకి సమన్లు (Summons) జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం న్యూఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో అనిల్ అంబానీ వాంగ్మూలాన్ని ఈడీ (ED) నమోదు చేయనుంది.
గత వారం రిలయన్స్ గ్రూప్‌తో సంబంధం ఉన్న 50 కంపెనీలు, 25 మంది వ్యక్తులకు చెందిన ముంబైలోని దాదాపు 35 చోట్ల ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన రెండు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈ చర్యలు చేపట్టింది.కాగా, బ్యాంకులకు రుణాల ఎగవేత కేసుల్లో అనిల్ అంబానీకి ఈడీ ఉచ్చు బిగుస్తోంది. రూ.3 వేల కోట్ల రుణ మోసం కేసులో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా అనిల్ అంబానీ కంపెనీలకు రుణాలు ఇచ్చిన బ్యాంకులకు ఈడీ లేఖ రాసింది.
రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్‌కు రుణాలు ఇచ్చిన 12-13 ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు ఈడీ తాజాగా లేఖలు రాసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూకో, పంజాబ్, సింద్ బ్యాంక్‌ల నుంచి రుణాల ఎగవేతకు సంబంధించిన వివరాలను తమకు ఇవ్వాలని కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఈ రుణాలకు సంబంధించి కొంత మంది బ్యాంకు అధికారులను కూడా ఈడీ పశ్నించే అవకాశం ఉందని తెలిసింది.
కాగా, 2017 నుంచి 2019 వరకు ఎస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. గ్రూపు కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంక్ ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ అధికారులు గుర్తించారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు సంబంధించిన విషయాలను ఈడీతో అధికారులు పంచుకున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742.60 కోట్లుగా ఉన్న కార్పొరేట్ రుణ వితరణ ఆ మరుసటి ఏడాదికిగాను రూ.8,670 కోట్లకు పెరిగింది.
Also Read..
“Anil Ambani | మరిన్ని కష్టాల్లో అనిల్ అంబానీ.. బ్యాంకులకు ఈడీ లేఖలు”
“అనిల్ అంబానీ కేసులో ఈడీ దూకుడు”
“అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు.. ఈ నెల 5న హాజరుకావాలని ఆదేశం”