న్యూఢిల్లీ, ఆగస్టు 1: బ్యాంకుల రుణాల ఎగవేత కేసుల్లో రిలయన్స్గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీకి గట్టి షాక్ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లుకౌట్ నోటీసులు జారీ చేసింది. రూ.3 వేల కోట్ల రుణ మోసం కేసుకు సంబంధించి ఈడీ శుక్రవారం సర్క్యూలర్ జారీ చేసింది. లుకౌట్ నోటీసుల కంటే ముందు బ్యాంక్ రుణ ఎగవేత కేసులో అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 5న న్యూఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో కంపెనీకి చెందిన ఇతర ఉన్నతాధికారులకు కూడా త్వరలో సమన్లు జారీ చేసే అవకాశాలున్నట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే అనిల్ అంబానీకి సంబంధించిన కంపెనీలో సోదాలు నిర్వహించిన ఈడీ..పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలించిన ఈడీ అనిల్‌ను ప్రశ్నించేందుకు తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ విచారణ నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేసింది. 2017 నుంచి 2019 వరకు యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే.
గ్రూపు కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంక్ ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ అధికారులు గుర్తించారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు సంబంధించిన విషయాలను ఈడీతో అధికారులు పంచుకున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742.60 కోట్లుగా ఉన్న కార్పొరేట్ రుణ వితరణ ఆ మరుసటి ఏడాదికిగాను రూ.8,670 కోట్లకు పెరిగింది.