Earphones | ప్రస్తుత కాలంలో ఇయర్ ఫోన్స్ ను ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇయర్ ఫోన్స్ ను ఉపయోగిస్తున్నారు. ప్రయాణం చేసేటప్పుడు, ఇంట్లో ఖాళీగా కూర్చునప్పుడు, అలాగే తమ పని చేసుకుంటూనే కొందరూ ఇయర్ ఫోన్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే చాలా మంది చుట్టూ ఉన్న శబ్దాన్ని తగ్గించి తమ పనిపై దృష్టి పెట్టడానికి ఇయర్ ఫోన్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని వాడడం వల్ల పనితీరు కొంత వరకు మెరుగుపడుతుందని చెప్పవచ్చు. అయితే ఇయర్ ఫోన్స్ ను ఎక్కువ సమయం లేదా ఎక్కువ శబ్దంతో ఉపయోగించడం వల్ల కొన్ని అనారోగ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆడియోలజీ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఎక్కువ సమయం ఇయర్ ఫోన్స్ ను వాడడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
85 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దంతో ఎక్కువ సమయం వినడం వల్ల వినికిడి శక్తి తగ్గే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇది చెవిలోని నాడులను శాశ్వతంగా దెబ్బతీయవచ్చు. ఇయర్ ఫోన్స్ ను ఎక్కువగా వాడే యువతలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇయర్ ఫోన్స్ ను ఎక్కువ సమయం వాడడం వల్ల చెవిలో నిరంతరం లాగుతున్నట్టు, మోగుతున్నట్టు లేదా ఏదో తెలియని శబ్దం వినబడినట్టు ఉంటుంది. అలాగే చాలా సమయం ఆడియో వినడం వల్ల చెవులు, మెదడు అలసిపోతాయి. దీని వల్ల మాటలు గుర్తించడం కష్టమవుతుంది. దృష్టి కూడా తగ్గుతుంది. ఇయర్ ఫోన్స్ ను ఎక్కువ సమయం వాడడం వల్ల బయట శబ్దాలు వినిపించకపోవడంతో పాటు చుట్టూ జరుగుతున్న విషయాలను మెదడు గమనించే సామర్థ్యం తగ్గుతుంది. అలాగే ప్రయాణం చేసేటప్పుడు ఇయర్ ఫోన్స్ ను వాడడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. 2025 లో జరిగిన కొన్ని పరిశోధనల ప్రకారం రోజుకు 2 గంటలకు పైగా ఇయర్ ఫోన్స్ వాడే వారిలో జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కనుక ఇయర్ ఫోన్స్ ను ఎక్కువగా వాడే వారు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం.
అలాగే వైద్యులు ఇయర్ ఫోన్స్ ను వాడే కొన్ని సురక్షితమైన మార్గాలను కూడా తెలియజేస్తున్నారు. చెవిలో నేరుగా శబ్దాన్ని పంపే ఇయర్‌బడ్ ల కంటే ఓవర్ ద ఇయర్ లేదా నాయిస్ క్యాన్సలింగ్ హెడ్‌ఫోన్స్ ను వాడడం మంచిది. ఇవి బయట శబ్దాన్ని తగ్గిస్తాయి కాబట్టి తక్కువ శబ్దంతో వినవచ్చు. ట్రాఫిక్ లేదా ఎక్కువ శబ్దాలు వచ్చే ప్రదేశం లో వాల్యూమ్ పెంచి వినాల్సి వస్తుంది. దీని వల్ల వినికిడి శక్తి దెబ్బతినే అవకాశం ఉంటుంది. కనుక అలాంటి సమయంలో కొద్దిగా విరామం తీసుకోవడం మంచిది. ఎలాంటి వినికిడి సమస్యలు లేకపోయినా అప్పుడప్పుడు వినికిడికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. దీని వల్ల చిన్న సమస్యలను కూడా ముందుగానే గుర్తించవచ్చు. ఇయర్ ఫోన్స్ పనిపై దృష్టి పెట్టడానికి మంచి సాధనంగా పని చేసినప్పటికి వీటిని సరైన విధంగా ఉపయోగించడం కూడా చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. తక్కువ శబ్దాలతో వినడం, విరామం తీసుకుంటూ వినడం, ఎక్కువ సమయం వినడాన్ని తగ్గించడం వంటివి చేయడం వల్ల ఇయర్ ఫోన్స్ ఉపయోగం హానిని కలిగించకుండా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.