Pawan Kalyan |పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాది సందర్భంగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన కథానాయికలుగా శ్రీలీల, రాశీ ఖన్నా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నటులు పార్థిబన్, కేఎస్ రవికుమార్, రావు రమేష్, ఎల్.బి శ్రీరామ్, అవినాష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను తమన్ అందిస్తున్నారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ పనులు ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం పవన్ కళ్యాణ్ పారితోషికం. సాధారణంగా భారీ రెమ్యునరేషన్ తీసుకునే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు మాత్రం తక్కువ మొత్తంతో ఒప్పుకున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. సమాచారం ప్రకారం దాదాపు పదేళ్ల క్రితం మైత్రి మూవీ మేకర్స్ నుంచి పవన్ కళ్యాణ్ సుమారు రూ.5 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నట్లు టాక్ ఉంది.
అయితే వివిధ కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా పలుమార్లు వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ సుమారు రూ.25 కోట్ల పారితోషికం మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు సాధిస్తే వాటాలో కొంత భాగం కూడా తనకు ఇవ్వాలని నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సినిమా విజయంపై పవన్ కళ్యాణ్ కూడా పూర్తి నమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది. ఇక ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ తాజాగా “ట్రైలర్ టీజ్” పేరుతో 43 సెకన్ల చిన్న వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో బ్యాక్‌గ్రౌండ్‌లో భగవద్గీత శ్లోకాలు వినిపిస్తుండగా పవన్ కళ్యాణ్ మాస్ స్టైల్ ఎంట్రీ అభిమానులను ఆకట్టుకుంది. “ఇందాక విన్నది భగవద్గీత… ఇది భగత్ గీత… దమ్మున్నోడు దాటొచ్చు” అంటూ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ అభిమానుల్లో మరింత హైప్ పెంచింది.