నవ కృషీవలుడు

- పంట చేలే ప్రయోగశాల
ఆ రైతుకు ఉన్నది ఆరెకరాల పొలం. బంగారం పండే భూమి. ఆరుద్రలో అడ్డెడు చల్లితే.. పునాసకు పుట్టెడు ధాన్యాన్నిచ్చే నేల తల్లి. కానీ, తిండి గింజల కోసం పరితపించలేదా రైతు. భావి తరాల కోసం ‘కృషి’ చేస్తున్నాడు. తన పొలాన్నే ప్రయోగ శాలగా మలిచి నూతన వరి వంగడాలను సృష్టి స్తున్నాడు. తరాల కిందట కనుమరుగైన విత్తనాలను పునఃసృష్టిస్తున్నాడు. చదువు కుంది పదో తరగతే అయినా.. నూతన సాగు విధానాలతో వ్యవసాయ శాస్త్రవేత్తలను తలపిస్తున్నాడు. ‘ప్రకృతి సాగు’తో అభినవ కృషీవలుడుగా గుర్తింపు తెచ్చుకున్న ఆ రైతు పేరు గారంపల్లి శ్రీకాంత్.
శ్రీకాంత్‌ది కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామం. అతడికి ఊరు చివరన ఆరెకరాల సాగుభూమి ఉన్నది. అందులో మూడెకరాలు కుటుంబ పోషణకు కేటాయించగా.. మరో మూడెకరాలను సమాజ శ్రేయస్సుకు, భావితరాల అవసరాలకు ప్రయోగశాలగా మార్చేశాడు. అరుదైన వరి వంగడాలను సేకరించడం అతడి అభిరుచి. సేకరించడమే కాదు.. వాటిని తన వ్యవసాయక్షేత్రంలోనే పండిస్తున్నాడు. పదేండ్ల కిందట సుభాష్ పాలేకర్ వ్యవసాయ విధానంపై టీవీలో ప్రసారమైన కార్యక్రమం చూశాడు శ్రీకాంత్. అప్పట్నుంచి వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నాడు. తనకున్న భూమిలో బంగారం పండించాలనుకున్నాడు. సాగు పద్ధతులపై అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. కొద్ది కాలంలోనే సాగుపై పట్టు సాధించాడు. ఆహారాన్ని అందిస్తున్న నేలతల్లి గర్భాన్ని విషాలతో నింపడం సరికాదనుకున్నాడు. పూర్తిగా సేంద్రియ పద్ధతులు పాటిస్తూ భూసారాన్ని కాపాడుతున్నాడు. ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నాడు. ఆవుమూత్రం, పేడతో తయారు చేసిన జీవామృతంతోనే అమృత తుల్యమైన పంటలను తీస్తున్నాడు.
120 రకాల ‘వరి’ సాగు
ప్రకృతి సేద్యం చేస్తూనే.. నూతన వంగడాల సేకరణపై దృష్టి సారించాడు శ్రీకాంత్. ఈ క్రమంలో దేశమంతా తిరిగాడు. ఎక్కడ రైతు సదస్సులు జరిగినా వాలిపోతుంటాడు. పత్రికల్లో, టీవీలో, సామాజిక మాధ్యమాల్లో నూతన వంగడాల వార్త కనిపించినా, వినిపించినా క్షణం ఆలస్యం కాకుండా వెళ్లిపోతాడు. విత్తన ప్రదర్శనలు ఎంత దూరాన జరిగినా వ్యయప్రయాసలకోర్చి సందర్శిస్తుంటాడు. క్షేమంగా వెళ్లి.. వచ్చేటప్పుడు గుప్పెడు ధాన్యం పట్టుకువస్తాడు. అదీ వీలుకాకపోతే దోసెడు బియ్యమైనా సాధిస్తాడు. అంతేనా, వాటిని సాగు చేసే పద్ధతులను తెలుసుకుని గానీ ఇంటి ముఖం పట్టడు. ఈ క్రమంలో ఆదివాసీలు, పాత పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న ఎంతోమంది రైతులను స్వయంగా కలిసి, రోజుల కొద్దీ వారితో గడుపుతుంటాడు. అక్కడి నుంచి వచ్చింది మొదలు ప్రయోగాలు మొదలుపెడతాడు. తన వ్యవసాయ క్షేత్రంలో వాటిని పండించి, గింజ గింజకూ వందింతల ధాన్యం పండిస్తాడు. అలా ఎన్నెన్నో అరుదైన విత్తనాలతో అద్భుతమైన భాండాగారాన్ని సృష్టించాడు. ఈ పదేండ్లలో దాదాపు 120 రకాల వరి విత్తనాలు సేకరించాడు శ్రీకాంత్. ఇందులో నవార, మాపిళై, సాంబ, కూలకర్, కాలబట్టి, రక్తసాయి, నారాయణ కామిని.. లాంటి అరుదైన రకాలను స్వయంగా పండించి, విత్తనాలను జాగ్రత్త పరుస్తున్నాడు.
విదేశీ విత్తనాలతో..
నిత్యం ఏదో ఒక కొత్త రకం పంటను సాగు చేస్తుంటాడు శ్రీకాంత్. సాగులో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపుతూ ఉంటాడు. విదేశాల్లో ఉన్న తన స్నేహితులను సంప్రదించి ఆయా దేశాల్లో పండిస్తున్న పంటల, సాగు విధానాల గురించి తెలుసుకుంటూ ఉంటాడు. విదేశాల నుంచి విత్తనాలు తెప్పించుకొని మరీ.. ఇక్కడ పండిస్తున్నాడు. విత్తనాలు తెప్పించుకోవడం సాధ్యం కానప్పుడు ఆ రకానికి చెందిన గుప్పెడు బియ్యం సేకరించి వాటితోనే సాగు చేసిన దాఖలాలూ ఉన్నాయి. ప్రస్తుతం శ్రీకాంత్ తన పొలంలో 40 రకాల వడ్లతో పంటలు సాగు చేస్తున్నాడు. ఇందులో ఉడికించకుండానే అన్నం తయారయ్యే బియ్యం కూడా ఉండటం విశేషం. మరో పక్షం రోజుల్లో ఈ పంట చేతికి రానుందని చెప్పుకొచ్చాడు శ్రీకాంత్. ఒక్క వరి మాత్రమే కాదు.. మక్కజొన్న, సామలు, కొర్రలు, వివిధ రకాల కూరగాయల సాగులోనూ ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో నలుపు, ముదురు ఎరుపు రంగు రకం మక్కజొన్నలను పండించాడు. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న అరుదైన బెండకాయలను పండించి.. ఆ విత్తనాలను భద్రపరిచి భావి తరాలకు మేలు చేస్తున్నాడు. ‘శభాష్ శ్రీకాంత్' అనిపించుకుంటున్నాడు.
వరి దివ్యౌషధం
మనం తినే ఆహారంతోనే సగం రోగాలను నయం చేయవచ్చు. ముఖ్యంగా పాలేకర్ విధానంతో సాగు చేసిన ఆహార పదార్థాలను తింటే, వ్యాధులు మన దగ్గరికి కూడా రావు. షుగర్, క్యాన్సర్, గుండె జబ్బులు, మూత్రపిండాలు, కాలేయ సంబంధిత రోగాలను నయం చేసేందుకు; జ్ఞాపకశక్తికి, దేహదారుఢ్యానికి ఉపయోగపడే బియ్యం కూడా పండిస్తున్నాను. నేను సాగు చేసిన అనేక రకాల వరి విత్తనాలను దేశంలోని ఎంతోమంది ఔత్సాహికులు తమవెంట తీసుకెళ్లారు. ప్రకృతి సేద్యంతో సాగు చేసిన బియ్యాన్ని చాలామంది కొనుగోలు చేశారు. హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ల ద్వారా సాగులో ఎన్నో మెలకువలు నేర్చుకున్నా. రకరకాల పంటల సాగు కొంతమేర సంతృప్తినిచ్చినా, ఇంకా ఏదో తెలియని వెలితి ఉంది. దానిని భర్తీచేసే క్రమంలో విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. కొత్త రకం విత్తనాలను సాగు చేయాలనే ఆసక్తి ఉన్న రైతులకు నావంతు సాయం చేస్తా. నా దగ్గర ఉన్న వంగడాలు కావాలనుకున్న రైతులు 98494 08194 నంబర్లో సంప్రదించవచ్చు.
- గారంపల్లి శ్రీకాంత్, రైతు
సాగుకు అక్షర రూపం
తాను పండించే వివిధ రకాల పంటల సాగు విధానాలను పది మందికీ తెలిపే ఉద్దేశంలో ఈ హలధారి కలం పట్టుకున్నాడు. తను సేకరించిన విత్తనాలు, వాటిని పండించే విధానం, అందులో ఉన్న పోషక విలువలు, వాటి ద్వారా నయమయ్యే వ్యాధులు.. ఇలాంటి వివరాలతో ఓ పుస్తకం తెస్తున్నాడు. ఏ వంగడాన్ని ఏ సమయంలో విత్తాలి? ఎన్ని రోజుల్లో కోతకు వస్తుంది? ఎంత ఎత్తు పెరుగుతుంది? ఒక గొలుసులో ఎన్ని గింజలు రావొచ్చు? ఎన్ని పాదులు ఉంటాయి? ..ఇలా సమగ్ర సమాచారాన్ని తన పుస్తకంలో పొందుపరుస్తానని చెబుతున్నాడు శ్రీకాంత్. అయితే ఈ పుస్తక ప్రచురణకు సరిపడా నిధులు తన దగ్గర లేవనీ, ఎవరైనా దాతలు సహకరిస్తే భవిష్యత్ తరాలకు మేలు చేసిన వారు అవుతారని అంటున్నాడు.
-గూడూరి కొండాల్‌రెడ్డి, హుజూరాబాద్
తాజావార్తలు
- హాఫ్ సెంచరీలతో చెలరేగిన శార్దూల్, సుందర్
- వాట్సాప్ కొత్త స్టేటస్ చూశారా?
- ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్
- బ్రిస్బేన్ టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత
- కర్నాటకలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న అమిత్‌షా
- డెంటల్ సీట్ల భర్తీకి అదనపు కౌన్సెలింగ్
- పొగమంచు ఎఫెక్ట్.. 26 రైళ్లు ఆలస్యం..
- రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా కేసులు
- దేశంలో కొత్తగా 15,144 కరోనా పాజిటివ్ కేసులు
- మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు