KTR | రాష్ట్ర ప్రభుత్వం పంటలు రైతుల నుంచి కోటాకు మించి కొనుగోలు చేయబోమన్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పండిన ప్రతి గింజ కూడా కొన్నదని.. పంటలు కొనబోమని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకునే దాకా పోరాటం చేస్తామనన్నారు. 15 రోజుల కింద ప్రతి గింజ కొంటానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట మార్చిండు. ఇక రైతన్నల పంటలు కొనబోమని క్యాబినెట్ సమావేశం పెట్టి మరి నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కేంద్రం నిర్ణయించిన నెలకే కొంటాము కాంగ్రెస్ ప్రభుత్వం పంటలు అదనంగా కొనబోదని చెప్పిందన్నారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతీ రైతన్న దగ్గరికి ప్రతి గ్రామానికి తీసుకుపోవాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
మంత్రులంతా ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం పెట్టుకొని రైతన్నలకు శాపం లాంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇకపైన తెలంగాణలో పంటలు కొనబోమని రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మొత్తం రైతాంగానికి శాపంగా మారబోతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇకపై ప్రభుత్వం ఇక్కడి నుంచి గింజలు కొనదట, వడ్లు కొనదట. రైతులు పండించే జొన్నలు, శనగలు కూడా కొనదట. మోదీ ప్రభుత్వం ఎంత కొనమంటే అంతే కొంటారట. అంటే ఎకరానికి 40 క్వింటాళ్ల వడ్లు పండించినా, రేపు మోదీ ప్రభుత్వం కోటా 10 క్వింటాళ్లే అని చెబితే, అంతే కొనుగోలు చేస్తారట.
మిగిలిన 30 క్వింటాళ్లు బయట అమ్ముకోవాల్సి వస్తుంది. నిన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇదే. నేను రైతులకు ఒకటే పిలుపు ఇస్తున్నాను.. అధికారులపై కాంగ్రెస్ నాయకుల కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి. మీరు ప్రకటించిన బోనస్ ఎక్కడ పోయిందని అడగాలి. మీరు హామీ ఇచ్చిన కొనుగోలు కేంద్రాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించాలి.మీ ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
రైతుల పంటలు కొనబోమన్న రేవంత్ రెడ్డిని మేము వదిలిపెట్టమని హెచ్చరించారు. 15 రోజుల క్రితం నువ్వే కదా ‘చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం’ అని చెప్పింది. ఈరోజు ఏమైంది..? ‘మోదీ మెడలు వంచుతా, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తా’ అని గొప్పలు చెప్పావు. ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నావు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు. ఆదిలాబాద్‌లో కూడా బీజేపీ ఎంపీ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో, ఈ 16 మంది ఎంపీలకు కూడా అంతే బాధ్యత ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా మోదీ ప్రభుత్వం “మేము వడ్లు కొనము” అని చెప్పినప్పుడు, మొత్తం మంత్రివర్గంతో కలిసి మేమంతా ఢిల్లీకి వెళ్లామన్నారు. కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం ధర్నా చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, వడ్లు కొనుగోలు చేసేలా చేసిన నాయకుడు కేసీఆర్ అన్నారు.
ఈరోజు ఉన్న 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు కూడా తమ బాధ్యతను గుర్తించాలి. పంటలు కొనకుండా రేవంత్ రెడ్డి తప్పించుకోవాలని చూసినా ఆయనను వదిలిపెట్టం. ఎంపీలను కూడా ప్రశ్నిస్తాం. ఆదిలాబాద్ ప్రజలు గెలిపించిన బీజేపీ ఎంపీని కూడా నిలదీయాలి. మోదీ ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదు..? రేవంత్ రెడ్డి ఎందుకు వడ్లు కొనడం లేదు? జొన్నలు ఎందుకు కొనడం లేదు? కందులు, సోయాబీన్ ఎందుకు కొనడం లేదు..? కేసీఆర్ హయాంలో కొన్న వారు ఇప్పుడు ఎందుకు కొనడం లేదు..?” అని గట్టిగా ప్రశ్నించాల్సిన బాధ్యత మనందరిదన్నారు.

