సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు అడ్డొస్తున్నాడని రెండేళ్ల కొడుకునే ఓ కన్నతల్లి హత్యచేసింది. ఫిట్స్ వచ్చి చనిపోయాడని అందర్నీ నమ్మించింది. కానీ తండ్రికి అనుమానం రావడంతో 20 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన స్వామి క్యాబ్ డ్రైవర్. భార్య జ్యోతి, రెండేళ్ల కుమారుడు హరికృష్ణతో కలిసి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో జ్యోతి నవీన్ అనే వ్యక్తితో అక్రర సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలుచుకునేది. ఇలా వాళ్లిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో బాబు తరచూ ఏడుస్తుండటంతో నవీన్ చిరాకు పడ్డాడు. ఈ క్రమంలోనే నీ కొడుకు నాకు నచ్చలేదు.. వాడిని చంపేద్దామని జ్యోతితో చెప్పాడు. అందుకు జ్యోతి కూడా ఓకే చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి ఏడుస్తున్న బాబును.. క్రూరంగా నేలకేసి కొట్టి చంపారు.
బాబు చనిపోయిన తర్వాత నాటకమాడిన జ్యోతి.. భర్త స్వామి ఇంటికి రాగానే అకస్మా్త్తుగా ఫిట్స్ వచ్చి బాబు చనిపోయాడని ఏడ్చింది. భార్య మాటలు నమ్మిన స్వామి.. నిజమేనని భావించి.. అదే రోజు రాత్రి మృతదేహాన్ని స్వగ్రామమైన తీగుల్ తీసుకెళ్లి ఖననం చేశాడు. కానీ కొద్దిరోజుల తర్వాత భార్య ప్రవర్తనలో తేడా రావడంతో స్వామికి అనుమానం మొదలైంది. పైగా ఇంట్లో రక్తపు మరకలు కనబడటంతో అది కాస్త బలపడింది. దీంతో తన కొడుకు మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా.. జ్యోతి నేరం అంగీకరించింది. ఈ ఘటనలో జ్యోతిని పోలీసులు అరెస్టు చేయగా.. నవీన్ పరారీలో ఉన్నాడు.