Ganja | తాండూర్, ఆగస్టు 30 : నేటి తరం యువత, ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాల మహమ్మారికి దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, గంజాయి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని తాండూర్ సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రోజున స్థానిక విద్యా భారతి ఉన్నత పాఠశాలలో పోలీస్ కళాబృందంచే విద్యార్థులకు సమాజంలో జరిగే మంచి చెడులపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఎస్ఐ మాట్లాడుతూ.. విద్యార్థి దశ మీ జీవితానికి అత్యంత కీలకమైన పునాది. ఈ సమయంలో తెలియని ఆకర్షణలకు లోనై గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడితే మీ భవిష్యత్తు అంధకారమయమవుతుంది.ఇది కేవలం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మీ కుటుంబాన్ని, మీ కలలను కూడా నాశనం చేస్తుంది. పోలీసులు మీ శ్రేయోభిలాషులు. ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా కఠినమైనది. ఒకసారి ఈ కేసులో చిక్కుకుంటే జీవితాంతం దాని పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మీరంతా చైతన్యవంతులై, మీ స్నేహితులను కూడా ఈ వ్యసనం వైపు వెళ్లకుండా కాపాడాలని హితవు పలికారు.
విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా, గంజాయి దుష్ప్రభావాలను కండ్లకు కట్టినట్లు చూపే దృశ్యరూపక వీడియోలను ప్రదర్శించి, వారిలో బలమైన అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణతోపాటు, విద్యార్థులలో సామాజిక బాధ్యతను పెంపొందించడంలో ముందుండాలన్నారు.
మంచిర్యాల జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు పోలీస్ శాఖ అహర్నిశలు శ్రమిస్తోందని, ఇందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతిరోజూ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల చైతన్యం, సహకారంతోనే గంజాయిని పూర్తిగా నిర్మూలించగలమని, తద్వారా నేరరహిత సమాజాన్ని స్థాపించగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
Harish Rao | పెట్రోల్‌కు రేవంత్ డబ్బులు ఇస్తున్నాడా..? పోలీసులకు హరీశ్‌రావు సూటి ప్రశ్న
పార్టీ మారితేనే సహకారం.. లేదంటే తిరస్కారం..