సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 17: మారుతున్న సాంకేతిక యుగంలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో నిజ నిర్ధారణకు ప్రాధాన్యం పెరిగిందని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డిలోని స్థానిక జిల్లా పరిషత్ మందిరంలో వార్తాలాప్ పేరుతో జర్నలిస్టులకు ఒక రోజు వర్క్షాప్ను పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ శృతిపాటిల్తో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు ద్వారా తయారవుతున్న విషయం, తప్పుదారి పట్టించే చిత్రాలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించి నిజమైన వార్తలు ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు.
నైతిక విలువలతో కూడిన నాణ్యమైన వార్తలు అందించాలని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల అధికారిక సమాచారాన్ని ప్రజలకు కచ్చితంగా చేరవేయడంలో పీఐబీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అనంతరం జర్నలిజంలో ఏఐ వినియోగంతో పాటు ఏఐ సాధనాలను ఏ విధంగా ఉపయోగించాలనే అంశాలపై సత్యప్రియ వివరించారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లాలోని జర్నలిస్టులు పాల్గొన్నారు.