ఎంతో ఆనందంతో బడికి వెళ్తున్న ఆ చిన్నారులను రైలు బండి ఒక్కసారిగా మింగేసింది. అప్పటిదాకా పిల్లల కేరింతలతో ఆహ్లాదకరంగా ఉన్న ఆ ప్రాంతం అంతలోనే ఆర్తనాదాలతో భీతావహంగా మారిపోయింది. మాయని గాయంగా మిగిలిపోయిన మాసాయిపేట రైలు ప్రమాద దుర్ఘటన జరిగి పుష్కరకాలం గడిచిపోయింది. 2014 జూలై 24న జరిగిన ఈ ప్రమాదంలో 16 మంది అభం శుభం ఎరుగని చిన్నారులు బలయ్యారు. మరెందరో పిల్లలు గాయపడ్డారు. నేటికీ ఆ గాయాల తాలూకు నొప్పిని భరిస్తున్నారు. ఈ ప్రమాదంలో తన ప్రాణాలకు తెగించి ఇద్దరు చిన్నారులను కాపాడిన ఎనిమిదేళ్ల చిన్నారి శివంపేట రుచిత సాహసం చాలామందికి స్పూర్తిగా నిలిచింది. ఈ ఘటనలో తన తోబుట్టువును పోగొట్టుకున్న ఈ యువతి జిందగీతో ఆనాటి విషాదాన్ని ఇలా గుర్తు చేసుకున్నది..
మాది తూప్రాన్ మండలంలోని వెంకటాయిపల్లి గ్రామం. అప్పటి భయానక దృశ్యం నా కండ్లముందు ఇంకా కదలాడుతుంది. అప్పటిదాకా సరదాగా గడిపిన మేమంతా ఒక్క క్షణంలో మృత్యువుకు దగ్గరయ్యాం. నాకప్పుడు ఎనిమిదేండ్లు. అదే బస్సులో నాతోపాటు నా చిట్టి చెల్లెలు, చిన్నారి తమ్ముడు ఉన్నారు. రోజూలాగే ఆ రోజూ మా ముగ్గురికి బోలెడన్ని ముద్దులిచ్చి అమ్మ జాగ్రత్తగా బస్సు ఎక్కించింది. మా నాన్న ఓ కంపెనీలో పనిచేస్తూ మా ముగ్గుర్ని బాగా చదివించాలని కాకతీయ స్కూల్లో చేర్పించారు. అమ్మానాన్నకు టాటా చెప్పి ఉత్సాహంగా బస్సెక్కి కూర్చున్నాం. మా బడికి వెళ్లే దారిలో రైల్వే ట్రాక్ వస్తుంది. రైలు వచ్చే సమయం అయితే.. ట్రాక్‌కు ముందుగానే బస్సు ఆపుతాడు డ్రైవర్.
బస్సులో ఉన్న పిల్లలం అందరం కిటికీల్లోంచి తలలు బయటికి పెట్టి రైలు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే వాళ్లం. రైలు వేగంగా వెళ్లిపోతుంటే అందులోని ప్రయాణికులకు టాటా చెప్పి తెగ సంబురపడిపోయేది. ఆ రోజూ అలాగే జరిగితే ఎంత బాగుండేది! కానీ, బస్సు రైల్వే ట్రాక్ మీద ఆగిపోయింది. బస్సు స్టార్ట్ చేయమని పిల్లలంతా అరుస్తున్నా.. ఎందుకో స్టార్ట్ చేయలేదు. బస్సులో నాకన్నా పెద్దవాళ్లూ ఉన్నారు. ఎలాగైనా తప్పించుకోవాలని బస్సు కిటికీ అద్దాలు పగులగొట్టాలని ప్రయత్నించారు. కానీ, వాళ్ల శక్తి సరిపోలేదు. బస్సు డోర్ కూడా లాక్ అయిపోయింది. కనుచూపు మేరలోనే రైలు కనిపించింది. ఏ క్షణంలో అయినా రైలు వచ్చి మా బస్సును ఢీ కొడుతుందని నా చిన్న బుర్రకు అర్థమైపోయింది. మృత్యువు ముంచుకొస్తున్నదని తెలిసి కొందరినైనా కాపాడాలని అనుకున్నా!

ఆ సమయంలో నిమిషాలు కూడా సెకండ్ల కన్నా వేగంగా కరిగిపోతున్నాయని అనిపించింది. సగం అద్దం తెరిచి ఉన్న కిటికీ గుండా వీలైనంత మందిని బయటికి పంపాలని నిశ్చయించుకున్నా. నా సీట్ పక్కనే ఉన్న సద్భన్, మహిపాల్‌రెడ్డి అనే పిల్లల్ని నా బలమంతా కూడదీసుకొని కిటికీలోంచి బయటికి తోసేశా! చెల్లి శ్రుతి ఎక్కడుందా అని చూస్తే డ్రైవర్ వెనుక సీట్లో ఉంది. నా దగ్గరికి రమ్మని పిలిచినా అది అక్కణ్నుంచి కదల్లేదు. తమ్ముడు వరుణ్‌ను పిలిచి వాణ్ని కూడా కిటికీలోంచి బయటికి తోసేందుకు ప్రయత్నించా. వాడు కాస్త బొద్దుగా ఉండటంతో కిటికీ మధ్యలోనే ఇరుక్కుపోయాడు. వాడిని బయటికి నెట్టే ప్రయత్నంలో ఉండగానే.. మా బస్సును రైలు ఢీ కొట్టింది. బస్సు తునాతునకలైంది. మేమంతా చెల్లాచెదురుగా పడిపోయాం. అంతలా ఎగిరిపడటంతో నా తలకు, వెన్నెముకకు గాయాలయ్యాయి. అప్పటికింకా స్పృహ కోల్పోలేదు. తమ్ముడు, చెల్లి కోసం చూట్టూ చూశాను. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. కొందరు పిల్లలు విగత జీవుల్లా పడి ఉన్నారు. ఇంకొందరు గాయాలతో విలవిల్లాడుతూ కనిపించారు.

ఈ ప్రమాదంలో 16 మంది విద్యార్థులు కన్నుమూశారు. వారిలో నా చెల్లెలు శ్రుతి కూడా ఉంది. నేను, తమ్ముడు, మరికొందరు గాయాలతో బయటపడ్డాం. నాకు గుండె సమస్య ఉంది. ఈ వార్త వినగానే నాకేమైందో అని కంగారుపడ్డారట అమ్మానాన్న. వాళ్లు ఘటనా స్థలానికి వచ్చేసరికే మమ్మల్ని దవాఖానకు తరలించారు. నేను కాపాడిన ఇద్దరు పిల్లలు ఆస్పత్రిలో నా ఎదురుగా ఉన్న బెడ్స్‌పైనే ఉన్నారు. తమను కాపాడింది నేనే అని పిల్లలు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు నాకు చేతులెత్తి దండం పెట్టారు. మరింత మందిని కాపాడలేకపోయానే అన్న వెలితి ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. నా చిట్టి చెల్లెల్ని కోల్పోయానన్న బాధ వర్ణనాతీతం. నేను కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది. తమ్ముడికి నా కన్నా ఎక్కువ గాయాలయ్యయి. వాడు కోలుకోవడానికి ఎక్కువ సమయమే పట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరి ప్రాణాలు కాపాడినందుకు 2015లో జనవరిలో జాతీయ సాహస బాలల పురస్కారం అందుకున్నాను. నేను చేసిన సహసాన్ని ఎన్సీఈఆర్టీ 2021లో నాలుగో తరగతిలో పాఠ్యాంశంగా పెట్టింది. ప్రాణాలతో బయటపడినా కొన్నిసార్లు ఆ ఘటన తలుచుకుంటే ఎంతో బాధ కలుగుతుంది. ఆ పీడకల నుంచి బయటికి రావడానికి చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకున్నాను. కానీ, నా చెల్లి మాత్రం నేటికీ నా మదిలో మెదులుతూనే ఉంటుంది. ‘కాళ్లు చేతులు విరిగిపోయి దక్కినా మంచిగుండు! సచ్చెదాక సాదుకుందుమ’ని అమ్మానాన్నలిద్దరూ ఇప్పటికీ బాధపడుతుంటారు. ఆ ప్రమాదంలో సాంకేతిక తప్పిదాలు కూడా చోటుచేసుకున్నాయి. అలాంటి లోపాలు సరిదిద్దాలంటే న్యాయ వ్యవస్థనే సరైన మార్గమని నా నమ్మకం. అందుకే పెండ్లి తర్వాత కూడా చదువు కొనసాగిస్తూ ఎల్ఎల్బీలో ప్రవేశం పొందాను. ప్రమాదాల్లో సొంతవారిని కోల్పోయిన బాధితులకు అండగా నిలవడం కోసమే లాయర్ వృత్తిని ఎంచుకున్నాను. భవిష్యత్తులో జడ్జి కావాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నాను.
రుచితక్క వాళ్లది మాది ఒకే ఊరు. రైలు ప్రమాదంలో నాతో పాటు సద్భన్ను కూడా అక్క కాపాడింది. ఆమెకు ఎన్ని థ్యాంక్స్‌లు చెప్పినా తక్కువే. ఈ ప్రమాదంలో నా కుడికాలు విరిగిపోయింది. నెత్తికి గాయాలై కుట్లు పడ్డాయి. చిన్న వయసు కావడంతో కోలుకోవడానికి ఏడాదికి పైగా టైం పట్టింది. ఇప్పటికీ పరిగెత్తినా, వేగంగా నడిచినా కాలు నొప్పి లేస్తుంది. అప్పుడప్పుడూ తలనొప్పి వస్తుంటుంది. అమ్మానాన్నలిద్దరూ వ్యవసాయం చేస్తూ తమ్ముడిని, నన్ను చదివిస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న నాకు పాటలు పాడటం అంటే ఎంతో ఇష్టం.