హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గంలోని ఓ ‘గట్టి’ నేత అధికారిక నివాసం ముందు నలుపు రంగు కార్ల కాన్వాయ్… ఆ కాన్వాయ్‌లో ఓ వోల్వో కారు. ఆ కారు మంత్రిగారిదా అంటే కాదు.. ఓ ప్రైవేట్ కంపెనీ పేరిట రిజిస్టర్ అయ్యింది. ఈ కారు విలువ అక్షరాలా కోటి రూపాయల పైమాటే. మరి దానికి ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకు అతికించారు, మంత్రిగారి కుటుంబ సభ్యులు ఎందుకు వాడుతున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కారు గిఫ్ట్ కిందనే వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ‘కార్ కొట్టు. కాంట్రాక్ట్ పట్టు’ అన్న పద్ధతిలోనే ఈ కారు గిఫ్ట్‌గా వచ్చినట్టు చెప్పుకొంటున్నారు. విద్యుత్తు రంగంలో కాంట్రాక్టు పనులు చేసే కంపెనీ పేరిట ఈ కారు రిజిస్టర్ అయి ఉండటమే ఈ చర్చకు కారణమైంది. సదరు కంపెనీ టీజీ రెడ్కో ఎంప్యానల్డ్ సప్లయర్ల జాబితాలో ఉంది. దానికి 15 మెగావాట్ల సామర్థ్యం గల రెండు క్యాప్టివ్ సోలార్ పవర్ ప్లాంట్లున్నాయి. ఈ కంపెనీకి ఏదో ఒక ప్రయోజనం చేకూర్చినందుకే కారును గిఫ్ట్‌గా సమకూర్చారని.. సదరు నేత కుటుంబసభ్యులు ఈ కారును గట్టిగానే వాడేస్తున్నారన్న వాదన వినిపిస్తున్నది.
అనేక ఆరోపణలు..
రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లుల విడుదలకు 20 శాతం కమిషన్ పుచ్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపించాయి.