ఖమ్మం కమాన్‌బజార్, జూలై 29: కేసీఆర్‌పై రాజకీయ ద్వేషంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి పన్నిన కుట్రలు విఫలమయ్యాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావు నాయకత్వంలో పార్టీ చేపట్టిన అవిశ్రాంత పోరాటం, ప్రజల తరఫున చేసిన నిరంతర ఉద్యమం ఫలితంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది మేడారం, గాయత్రి పంపుహౌస్‌ల మోటార్లను ప్రభుత్వం తిరిగి ప్రారంభించాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టే తెలంగాణకు జలాధారం, ప్రాణాధారమని స్పష్టం చేశారు.
రాష్ట్ర భవిష్యత్తు నీటి అవసరాల దృష్ట్యా ఎంతో దూరదృష్టితో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మహత్తర ప్రాజెక్టును నిర్మించారని గుర్తుచేశారు. కరువులు, వర్షాభావ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు సాగు, తాగునీటికి భద్రత కల్పించడంలో కాళేశ్వరం కీలకపాత్ర పోషిస్తోందని జ్ఞప్తికి తెచ్చారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిర్వహించి, అన్ని పంపుహౌస్‌లు, పంపింగ్ వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులు, ప్రజల నీటి అవసరాలను తీర్చడంలో కాళేశ్వరం ప్రాజెక్టు మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని కోరారు.