ఆరోగ్యం కోసం వ్యాయామశాల వైపు ఎంతమందని చూడగలరు. వర్కవుట్లు అందరికీ వర్కవుట్ అయ్యే విషయం కాదు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే చిరు ధాన్యాలను నమ్ముకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఖరీదైన సప్లిమెంట్స్ కాకుండా కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు తీసుకుంటే… భారీ కసరత్తులు చేయకుండానే ఆరోగ్యంగా ఉండొచ్చని సలహా ఇస్తున్నారు. ఇందుకోసం ప్రతిరోజూ ఆహారంలో అధిక ప్రొటీన్ ఉండేలా చూసుకోవడంతో పాటు సమతుల ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నారు. స్నాక్స్ అనగానే బిస్కెట్లు, చాక్కెట్లు, కుర్కురే, చిప్స్, రస్నాలు గుర్తుకువస్తాయి. ఇవి నాలుకను ఎంత సంతోషపెడతాయో, ఆరోగ్యానికి అంత చేటుచేస్తాయన్నది జగమెరిగిన సత్యం. గుండె నాళాల్లో రక్త సరఫరాకు అంతరాయం కలిగించి, కొవ్వు పేరుకునేలా చేస్తాయి. తద్వారా హృదయ సంబంధ రోగాలకు బీజాలు వేస్తాయి.
వాటికి ప్రత్యామ్నాయంగా అదే ఆకారంతో రుచికి ఏ మాత్రం తీసిపోకుండా రాగి, జొన్న వంటి చిరుధాన్యాలతో చిప్స్, బిస్కెట్లు లభ్యమవుతున్నాయి. చక్కెర వాడకుండా తాటి బెల్లంతో అదే తీపిదనాన్ని, రుచిని కోల్పోకుండా తయారవుతున్న స్నాక్స్ దొరికేస్తున్నాయి. ఈ ‘చిరు’తిళ్లను తినడం వల్ల ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు. అలాగే సిరిధాన్యాలతో తయారుచేసిన నూడుల్స్, స్నాక్స్, నూకలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఆహారపదార్థాలు ఒక్కసారిగా మార్చకుండా రోజూ చేసుకునే ఆహారంలోనే చిన్న చిన్న మార్పులతో ప్రారంభించి అలవాటు చేసుకుంటూ వెళ్లాలి. ఒకరోజు రాగిసంకటి, ఒకరోజు జొన్నలు. చిరుధాన్యాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. వారానికి ఒకసారి చిరుధాన్యాలతో చేసిన వంటకాలు ప్రారంభించి ప్రతిరోజూ వంటలో చిరుధాన్యాలకు కొంత చోటివ్వడంతో అనతికాలంలోనే ఆరోగ్యంలో, శరీరాకృతిలోనూ ఎంతో మార్పును గమనించవచ్చు.