న్యూఢిల్లీ: దత్తత బిడ్డ కన్నబిడ్డకు ఏమాత్రం భిన్నం కాదని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. మూడు నెలల కంటే పెద్ద వయసున్న బిడ్డను దత్తత తీసుకున్న మహిళకు ప్రసూతి సెలవును నిరాకరించరాదని తీర్పు చెప్పింది. ప్రసూతి రక్షణ ప్రాథమిక మానవ హక్కని, కుటుంబాన్ని ఏర్పరుచుకోవడానికి జీవ సంబంధం లేని మార్గాలు కూడా అంతే చట్టబద్ధమైనవని కోర్టు స్పష్టం చేసింది. మూడు నెలల కంటే తక్కువ వయసున్న బిడ్డను చట్టబద్ధంగా దత్తత తీసుకున్న మహిళ లేదా తాను కన్న బిడ్డను దత్తత ఇచ్చిన తల్లి బిడ్డను దత్తత ఇచ్చిన రోజు నుంచి 12 వారాల పాటు ప్రసూతి సెలవులకు అర్హులన్న సామాజిక భద్రతా కోడ్‌కు చెందిన సెక్షన్ 60(4) రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.