రంగారెడ్డి, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సహకార సంఘాల అధ్యక్షుల తొలగింపునకు ప్రభు త్వం కుట్ర చేస్తున్నది. గత ఎన్నికల్లో జిల్లాలో 90 శాతానికిపైగా సహకార సంఘాలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. అలాగే, జిల్లా సహకార సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు కూ డా బీఆర్ఎస్కు చెందిన వారే ఎన్నికయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన డీసీసీబీ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి ఎన్నికలకు ముం దు కాంగ్రెస్‌లో చేరి తాండూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఉపాధ్యక్షుడిగా ఉన్న సత్తయ్యను అధ్యక్షుడిగా నియమించారు.
ఆయ న కూడా తన పదవిని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌లో చేరాడు. హస్తం పార్టీలో చేరని బీఆర్ఎస్లో ఉన్న సహకార సంఘాల అధ్యక్షులను ఏదో సాకుతో ఇప్పటికే చాలామందిని తొలగించారు. అలా తొలగించిన వారి లో మంచాల, ఉప్పరిగూడ, బాటసింగారం వంటి సహకారసంఘాల అధ్యక్షులున్నారు. మిగిలిన వారిని పలు రకాలుగా ఇబ్బందులు పెట్టినా వారు మాత్రం పార్టీ మారకుండా బీఆర్ఎస్తోనే ఉన్నారు. వారిని కూడా ఏదో సాకుతో తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే జిల్లాలో బీఆర్ఎస్లో ఉన్న సహకార సంఘాల అధ్యక్షుల జాబితాను తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సహకార సంఘాల పాలక వర్గా ల గడువు ముగియడంతో మరో ఆరు నెలల పాటు ప్రభుత్వం పదవికాలాన్ని పొడిగించింది. పదవి కాలాన్ని పొడిగించినా ఇప్పటివరకు సహకారసంఘాల పాలకవర్గాలకు ఆదేశాలు మాత్రం ఇవ్వలేదు. బీఆర్ఎస్కు చెందిన వారిని తొలగించిన తర్వాతే కాంగ్రెస్‌కు చెందిన వారిని అధ్యక్షులుగా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
జిల్లా సహకార సంఘాల సీఈవోలు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నారని భావించి ఇటీవల జిల్లాలోని 37మంది సీఈవోలను ప్రభుత్వం రాత్రికి రాత్రే బదిలీ చేసింది. కొన్నేండ్లుగా తాము సహకార సంఘాల్లో పనిచేస్తుండగా ఏ కారణం లేకుండా బదిలీ చేయడంపై వారు కోర్టును ఆశ్రయించారు. కాగా, కోర్టు గురువారం సీఈవోలకు అనుకూలంగా స్టేటస్కో ఆర్డర్ ఇచ్చింది. గతంలో ఉన్న సీఈవోలనే యథావిధిగా కొనసాగించాలని ఆర్డర్ ఇవ్వడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 37 సహకార సంఘాలున్నాయి. గత ఎన్నికల్లో సుమారు 30 సహకార సం ఘాల వరకు బీఆర్ఎస్కు చెందిన వారే అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారడంతో చాలా మంది బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. మిగిలిన వారిలో కొందరిని వివిధ కారణాలు చూపి తొలగించారు. పార్టీ మారకుండా ఉన్న మరి కొందర్ని కూడా ఏదో సాకు చూపి తొలగించాలని ప్రభుత్వం యత్నిస్తున్నట్లు సమాచారం.
బాటసింగారం సహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్న బీఆర్ఎస్కు చెందిన భరత్‌ను ఎలాంటి కారణం లేకుండానే తొలగిం చి కాంగ్రెస్‌కు చెందిన జైపాల్‌రెడ్డిని ప్రభు త్వం నియమించింది. దీంతో భరత్ కోర్టును ఆశ్రయించగా..అతన్నే కొనసాగించాలని తీర్పు ఇచ్చినా అధికారులు మాత్రం భరత్‌ను కొనసాగించేందుకు సిద్ధంగా లేనట్లు వినికిడి. ఇటీవల జైపాల్‌రెడ్డి చైర్మన్ చాంబర్‌కు తాళం వేసుకుని వెళ్లిపోయాడు. భరత్ కోర్టు ఆర్డర్ మేరకు ఆఫీసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అతడు వెళ్లకుండా అడ్డుపడ్డారు. కోర్టు ఆదేశాలున్నా అధికారులు తనకు న్యాయం చేయడంలేదని భరత్ వాపోయారు.