Land Grabbing | బెల్లంపల్లి పట్టణంలోని నడి బొడ్డున ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడానికి యత్నాలు జరుగుతుండడం స్థానికంగా సంచలనంగా మారింది. స్వచ్చంద సేవా సంస్థ ముసుగులో ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి యత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ స్థలంలో ఆటోలను పార్కింగ్ చేసుకుంటున్నారు. బెల్లంపల్లి నుంచి భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం మండలాలకు ఇక్కడి నుంచి ఆటోలు రాకపోకలు సాగిస్తూ ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేరవేస్తుంటాయి.
ఆర్డీవో హరికృష్ణ తమకు ఆటో పార్కింగ్ స్థలాన్ని అన్నదానాలు నిర్వహించడానికి నాలుగు గుంటలు కేటాయించినట్లు సదరు స్వచ్చంద సేవా సంస్థ సభ్యులు ప్రచారం చేసుకోవడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. పట్టణానికి చెందిన ఓ స్వచ్చంద సేవా సంస్ధ గత కొన్ని ఏండ్ల నుంచి కాంటా చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అన్నదానాలు నిర్వహించడానికి తమకు స్థలం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రెవెన్యూ అధికారులు విన్నవించుకున్నట్లు తెలుస్తోంది.
జీవనాధారం కోల్పోతామని..
ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి తమకు ఆటో పార్కింగ్ స్థలంలో రెవెన్యూ అధికారులు నాలుగు గుంటల స్థలం కేటాయించినట్లు ప్రచారం చేసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఆటో యూనియన్ నాయకులు ఆర్డీవో హరికృష్ణను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత కొన్ని ఏండ్లుగా తాము ఆటోలను ఆ స్థలంలో పార్కింగ్ చేసుకుంటున్నామని తమ జీవనాధారం కోల్పోతామని ఆ స్థలాన్ని ఎవరికీ కేటాయించవద్దని కోరారు.
ఈ క్రమంలో తమకు ఆస్థలం కేటాయించారని చెబుతూ ఈనెల 11న ఆ స్థలంలో అన్నదానం నిర్వహించడానికి సదరు సేవా సంస్థ సభ్యులు టెంట్లు వేయడానికి ముందుకు వచ్చారు. దీనిని ఆటో డ్రైవర్లు, యూనియన్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో వారు చేసేదేమి లేక యధావిధిగా పల్లెటూరి బస్టాండ్ ముందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. పార్కింగ్ చేసుకుంటున్న స్థలాన్ని సేవా సంస్థకు కేటాయించడం సరి కాదని, గత కొన్ని ఏండ్ల నుంచి పార్కింగ్ చేసుకుంటున్నామని, అలా చేస్తే ఈనెల 18న ఆటోలను ఎక్కడికక్కడ నిలిపి వేసి కలెక్టరేట్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేయనున్నట్లు యూనియన్ నాయకులు హెచ్చరిస్తున్నారు.
ఆ స్థలం ఎవరిది కాదు-01 బిపిఎల్ 12బీ- హరికృష్ణ, బెల్లంపల్లి ఆర్డీవో
పట్టణం నడిబొడ్డున పల్లెటూరి బస్టాండ్ వెనుక ఉన్న స్థలం ప్రభుత్వానిదే. ఆ స్థలం ఆటో డ్రైవర్లకు గానీ జనహిత సేవా సమితి స్వచ్చంద సేవా సమితికి కానీ ఎటువంటి సంబంధం లేదు. అన్నదానాల కోసం స్థలం కావాలంటే నోటి మాటగా స్థలాన్ని చూపించామే తప్పా. ఎటువంటి స్థలం పత్రాలు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే రెవెన్యూ చట్ట ప్రకారం చర్యలు తప్పవు.
Ahmedabad plane crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ ప్రముఖుల దిగ్భ్రాంతి
Nidamanoor : భూ భారతితో భూములకు భద్రత : వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం
Surekha Vani | సురేఖా వాణి చేసిన పనికి తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్