Thandur | తాండూర్, ఫిబ్రవరి 7 : వ్యవసాయ బోర్లు వేయడం వల్లనే గ్రామంలో తాగునీటికి, భూగర్భ జలలాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అలాంటి బోర్లు వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ రేచిని గ్రామపంచాయతీ పరిధి బారెపల్లి గ్రామస్తులు శనివారం మంచిర్యాల జిల్లా కలెక్టర్, తాండూర్ తహసీల్దార్ జ్యోత్స్నకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. జానకిప్రసాద్ అనే వ్యక్తి గ్రామానికి దగ్గరలో 40 ఎకరాలు భూమి కొనుగోలు చేశారు. అందుకుగాను అతను తన చేనులో వ్యవసాయ బోర్లను వేయించాడు. అక్కడ వ్యవసాయానికి సరిపడా నీరు అందకపోవడంతో మా గ్రామానికి 200 మీటర్ల దూరంలో ఒక గుంట భూమిని కొనుగోలు చేసి అందులో అధిక సంఖ్యలో బోర్లు వేసి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అతని వ్యవసాయ భూమికి అందించడానికి ప్రయత్నం చేస్తుండగా గ్రామస్తులందరం కలిసి ఆ బోరు నిర్మాణ పనులను అడ్డుకోవడం జరిగింది.
మా గ్రామానికి రానున్న రోజుల్లో త్రాగునీటి సమస్య ఏర్పడుతుంది. కాబట్టి అధికారులు స్పందించి దగ్గరలో వ్యవసాయ బోర్లు వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వ్యవసాయానికి సంబంధించి బోర్లు రెండు కిలోమీటర్ల దూరంలో అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే జానకి ప్రసాద్ మా ఊరికి దగ్గరలో వేసిన బోరును దానిని పూర్తిగా డిస్మిటల్ చేయాల్సిందిగా కోరారు.