– నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
రామగిరి, ఆగస్టు 15 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 8 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ అట్టడుగున ఉన్న పేద ప్రజలకు ఇంకా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని, కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు పథకాలు అందకుండా చేస్తుందన్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలను నీరుగారుస్తోందని విమర్శించారు. పేదలు, రైతులు, నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తన మొండి వైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎం.సి.కోటిరెడ్డి, నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భరత్ కుమార్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చీర పంకజ్ యాదవ్, బొర్ర సుధాకర్, మాజీ ఆర్వో మాలే శరణ్య రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టే మల్లికార్జున రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ ముందడి సైదిరెడ్డితో పాటు నగర, మండల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.