Arrest : అఫ్గానిస్థాన్ (Afghanistan) కేంద్రంగా నడుస్తున్న ఉగ్రముఠా (Terror Group) తో సంబంధం ఉన్న అసఫూల్ మాలిక్ (Asaful Malik) అనే యువకుడిని బెంగళూరు పోలీసులు (Bengalore Police) అరెస్ట్ చేశారు. తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) సభ్యుడితో కలిసి ఆ సంస్థలో చేరడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. అనుమానాస్పద ఆన్లైన్ కార్యకలాపాలపై సమాచారం అందడంతో అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన అసఫూల్ మాలిక్ అనే వ్యక్తి ఏడాదిగా బెంగళూరులోని జిగాని ప్రాంతంలో ప్రముఖ టెక్ కంపెనీలో సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్నాడు. కొంతకాలంగా అతడు అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియాలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు గుర్తించారు. శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఉగ్రవాద సంస్థలతో లింకులు బయపడ్డాయి.
అఫ్గాన్‌కు చెందిన టీటీపి ఉగ్రసంస్థ హ్యాండ్లర్‌తో అతడు తరచూ సంప్రదింపులు జరుపుతున్నాడు. భారత్, పాకిస్థాన్‌లో దాడులకు వారు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అఫ్గాన్‌కు వెళ్లి.. ఉగ్ర సంస్థలో చేరడానికి అతడు సిద్ధమవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పాకిస్థాన్‌లోని ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్న ఇద్దరు ఉత్తర్‌ప్రదేశ్ వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.